అయోధ్య కేసు విచారణ సమాప్తం- తీర్పుపై ఉత్కంఠ రాజకీయంగా అత్యంత సున్నితమైన అయోధ్య కేసులో విచారణ పూర్తయింది. 40 పనిదినాలు రోజువారీ వాదనలు విన్న సుప్రీంకోర్టు... తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అదనంగా ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పాలంటే.. 3 రోజుల్లో లిఖితపూర్వకంగా అందించాలని సూచించింది.
ఈరోజు సాయంత్రం 5గంటలలోపు వాదనలు ముగించాలని ప్రధాన న్యాయమూర్తి నిర్దేశించగా... అందుకు గంట ముందే విచారణ పూర్తి చేసింది సర్వోన్నత న్యాయస్థానం.
తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
అయోధ్య కేసులో తీర్పు వెలువరించే తేదీపై సుప్రీంకోర్టు ఎలాంటి ప్రకటన చేయలేదు. అత్యున్నత ధర్మాసనం నిర్ణయం ఎవరి పక్షాన ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు. ఆలోగా అయోధ్య కేసు తీర్పు వెలువడే అవకాశముంది.
ఆఖరి రోజు వాడీవేడి వాదనలు
అయోధ్య కేసు విచారణ చివరి రోజున సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. రామ జన్మస్థలాన్ని చూపుతున్నట్లుగా చెబుతున్న ఓ మ్యాప్‌ను కోర్టు ముందు ఉంచేందుకు అఖిల భారత హిందూ మహాసభ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ ప్రయత్నించారు. ఇందుకు ముస్లింల తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ మ్యాప్‌ను ఏం చేయాలని అడగ్గా... చించేయాలని ధర్మాసనం సూచించింది. ధావన్ కోర్టులోనే ఆ పని చేశారు.
అనేక మలుపులు...
అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. అనేక వాయిదాల నడుమ సర్వోన్నత న్యాయస్థానంలో ఈ కేసు విచారణ సాగింది. ఓ దశలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కరించాలని సుప్రీంకోర్టు ప్రయత్నించింది.
కమిటీ విఫలం...!
అయోధ్య వివాదంలో రెండు వర్గాలతో చర్చించి, పరిష్కారం కనుగొనడం కోసం మార్చి 8న సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్‌ఎంఐ కలిఫుల్లా నేతృత్వంలోని ఈ కమిటీలో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు సభ్యులు.
దాదాపు నాలుగున్నర నెలల పాటు శ్రమించిన కమిటీ హిందూ-ముస్లిం వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపింది. ఆగస్టు 1న నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు... ఇరు వర్గాలకీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించడంలో కమిటీ విఫలమైందని పేర్కొంది.
ప్రధా న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 6న అయోధ్య కేసుపై రోజువారీ విచారణ ప్రారంభించింది. 40 రోజులపాటు వాదనలు ఆలకించింది. తీర్పును వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'కశ్మీర్లో శాంతి కోసమే ఆర్టికల్ 370 రద్దు'