ఆర్టికల్-370 రద్దు రాజ్యాంగానికి విరుద్ధమని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై వాదనలు ఆలకించింది.
ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో ఆర్టికల్ 370ని ఎలా రద్దు చేస్తారని వాదించారు సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్. మాజీ ఐఏఎస్ అధికారి, రాజకీయ నానే షా ఫేసల్ పిటిషన్‌తో పాటు పలు వ్యాజ్యాలపై ఆయన వాదనలు వినిపించారు. రాష్ట్రపతి పాలనను అడ్డంపెట్టుకుని.... జమ్ముకశ్మీర్ ప్రజాప్రతినిధుల ద్వారా అక్కడి ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఎలా విడగొడతారని ప్రశ్నించారు.
ఒకటి పూర్తయిన తర్వాతే మరొకటి
పలువురు స్వతంత్రులు, న్యాయవాదులు, ఉద్యమకారులు, నేషనల్ కాన్ఫరెన్స్, జమ్ముకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, సీపీఎం తదితర రాజకీయపార్టీల నేతలు సైతం ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ.. వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై నవంబరు 14నే విచారణ జరిపిన న్యాయస్థానం.. ఒక పిటిషన్ విచారణ పూర్తయిన తర్వాతే మరొక వ్యాజ్యంపై వాదనలు వింటామని తెలిపింది.
నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున ఎంపీ మహ్మద్ అక్బర్ లోనే, విశ్రాంత న్యాయమూర్తి హస్నైన్ మసూది, జమ్ముకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, సీపీఎం నేత మహ్మద్ యూసఫ్ తరిగామి సహా పలువురు మాజీ సైనికాధికారులు, మాజీ ప్రభుత్వాధికారులు ఆర్టికల్-370 రద్దుకు వ్యతిరేకంగా సుప్రీంలో వ్యాజ్యాలు దాఖలు చేశారు.