పిల్లల సంరక్షణ కేంద్రాల(సీసీఐ) నుంచి ఇళ్లకు వెళ్లిన చిన్నారులకు విద్యాసాయం కింద నెలకు రూ.2,000 చొప్పున చెల్లించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేందుకు కావాల్సిన పరికరాలు, పుస్తకాలు, శానిటైజరీ ఉత్పత్తులు అందించాలని సూచించింది. కరోనా ప్రభావం వల్ల సంరక్షణ కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితిని న్యాయస్థానం సుమోటాగా తీసుకుంది. దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన జస్టిస్ ఎల్. నాగేశ్వర్ రావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పు చెప్పింది.
కొవిడ్ కంటే ముందు సీసీఐలలో 2,27,518 చిన్నారులు ఉండగా.. 1,45,788 మంది ఇళ్లలో పునరావాసం కోసం వెళ్లారని ధర్మాసనం పేర్కొంది. జల్లా చిన్నారుల సంరక్షణ విభాగం(డీసీపీయూ) సూచనల అనుసారం ఈ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం 30 రోజుల్లోగా అందించాలని ఆదేశించింది. సీసీఐలలోని చిన్నారుల సౌకర్యాల పురోగతి గురించి జిల్లా న్యాయసేవల సంస్థకు డీసీపీయూలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని తెలిపింది.