తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లేఖల చుట్టూ 'మహా' రాజకీయం- సుప్రీం కీలక ఆదేశాలు - మహారాష్ట్ర తాజా వార్తలు

మహారాష్ట్ర రాజకీయ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.  ప్రభుత్వ ఏర్పాటుకు ఫడణవీస్​ను ఆహ్వానిస్తూ గవర్నర్​ రాసిన లేఖ, అందుకు అనుగుణంగా గవర్నర్​కు ఫడణవీస్ ఇచ్చిన మద్దతు లేఖను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు రేపటి వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాతే మహారాష్ట్ర వ్యవహారంపై తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

లేఖల చుట్టూ 'మహా' రాజకీయం- సుప్రీం కీలక ఆదేశాలు

By

Published : Nov 24, 2019, 3:39 PM IST

Updated : Nov 24, 2019, 6:46 PM IST

లేఖల చుట్టూ 'మహా' రాజకీయం- సుప్రీం కీలక ఆదేశాలు

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్​ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్​ రాసిన లేఖ, అందుకు అంగీకరిస్తూ గవర్నర్​కు ఫడణవీస్​ ఇచ్చిన లేఖను సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం సోమవారం ఉదయం పదిన్నర గంటల వరకు గడువు ఇచ్చింది. ఫడణవీస్​ ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా శివసేన-కాంగ్రెస్‌- ఎన్​సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్​ ఎన్​వీ రమణ, జస్టిస్​ అశోక్​ భూషణ్, జస్టిస్​ సంజీవ్​ ఖన్నాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ముఖ్యమంత్రి ఫడణవీస్‌, ఉప ముఖ్యంత్రి అజిత్‌ పవార్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

లేఖల సమర్పణకు సుముఖంగా ఉన్నట్లు సొలిసిటర్ జనరల్​ తుషార్​ మెహతా న్యాయస్థానానికి తెలియజేశారు. ఆ లేఖలు పరిశీలించిన అనంతరం బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

వెంటనే బలపరీక్ష...

లేఖల సమర్పణపై సుప్రీంకోర్టు ఆదేశాలకు ముందు వాడీవేడి వాదనలు జరిగాయి. మెజార్టీ లేని ఫడణవీస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగవిరుద్ధం, చట్టవిరుద్ధమని ప్రకటించాలని కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన... సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరాయి. బేరసారాలు, చట్టవ్యతిరేక చర్యలను నివారించేందుకు వీలుగా 24 గంటల్లోపు విశ్వాసపరీక్ష జరిగేలా ఆదేశించాలని ఈ మూడు పార్టీలు కోర్టుకు విన్నవించాయి.

దేవేంద్ర ఫడణవీస్‌కు మెజార్టీ ఉంటే నిరూపించుకోవాలని లేదంటే తమకు అవకాశం ఇవ్వాలని శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీ సుప్రీం కోర్టును కోరాయి. 41 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు భాజపాతో లేరని అయినా వారి మద్దతు ఉందని చెప్పి ఫడణవీస్‌ సర్కారు ఏర్పాటు చేశారని ఆరోపించాయి.

కేబినెట్​ ఆమోదం ఏది?

కేంద్రమంత్రివర్గం ఆమోదం లేకుండానే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారని శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ తరఫు సీనియర్‌ న్యాయవాదులు కపిల్ సిబిల్‌, అభిషేక్​ మను సింఘ్వీ వాదించారు. రాష్ట్రపతి పాలన తొలగించాలని గవర్నర్‌ సిఫార్సు చేయటం పక్షపాతం, దురుద్దేశంతో కూడుకున్నదని కపిల్‌ సిబల్‌ కోర్టుకు తెలిపారు. ఇవాళే మహారాష్ట్రలో బలపరీక్ష జరిగేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. కర్ణాటక అంశంలో 24 గంటల్లో బలపరీక్షకు ఆదేశించారని గుర్తు చేశారు.

ఆదివారం విచారణా..?

భాజపా, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల తరఫున వాదనలు వినిపించారు సీనియర్​ న్యాయవాది ముకుల్‌ రోహత్గి. శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ బాంబే హైకోర్టును కాకుండా సుప్రీంకోర్టును నేరుగా ఎలా ఆశ్రయిస్తాయని ప్రశ్నించారు. అధికరణ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు కోర్టులకు జవాబుదారీ కాదని ముకుల్‌ రోహత్గీ తెలిపారు. గవర్నర్‌ చర్యను తప్పుబట్టడానికి వీల్లేదని, స్వీయ విచక్షణపై ఆయన ఎవరినైనా నియమించవచ్చని కోర్టుకు వివరించారు. బలపరీక్ష ఇవాళ లేదా రేపు నిర్వహించాలని పార్టీలు ఎలా కోరుతాయని రోహత్గీ ప్రశ్నించారు. స్పీకర్‌ ఎంపిక, ఉత్తర్వుల విడుదలకు గవర్నర్‌కు సమయం ఇవ్వాలని కోరారు. బలనిరూపణకు సమయం పడుతుందని తెలిపారు.

అందరి వాదనలు విన్న న్యాయస్థానం... గవర్నర్​, ఫడణవీస్​​ లేఖల సమర్పణకు ఆదేశించింది.

Last Updated : Nov 24, 2019, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details