తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారికి జీతాలివ్వని రాష్ట్రాలపై చర్యలు తీసుకోవచ్చు' - quarantine period

వైద్య సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలన్న తమ ఆదేశాలను నాలుగు రాష్ట్రాలు పాటించలేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ విషయంలో నిస్సహాయంగా ఉండకూడదని కేంద్రానికి సూచించింది ధర్మాసనం. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

SC asks Centre to ensure salaries paid to doctors on time, quarantine period not treated as leave
'మీకు అధికారాలు ఉన్నాయి- రాష్ట్రాలపై చర్యలు తీసుకోవచ్చు'

By

Published : Jul 31, 2020, 1:55 PM IST

కరోనాపై పోరులో ముందుండి సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలన్న ఆదేశాలను మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, త్రిపుర రాష్ట్రాలు పాటించడం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా యోధులకు వేతనాలు చెల్లించాలన్న ధర్మాసనం ఆదేశాల ప్రకారం జూన్ 18న అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఈ నాలుగు రాష్ట్రాలు ఉత్తర్వులు పాటించలేదని పేర్కొన్నారు.

నిస్సహాయులు కాదు

అయితే ఈ విషయంలో నిస్సహాయంగా చూస్తూ ఉండకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఆదేశాలు అమలయ్యేలా చూసుకోవాలని స్పష్టం చేసింది. దీనితో పాటు వైద్య సేవల సిబ్బంది క్వారంటైన్ సమయాన్ని సెలవు రోజులుగా పరిగణించి వేతనాలు తగ్గించే విషయంలో అనుసరిస్తున్న విధానంపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.

"కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ఉత్తర్వులను రాష్ట్రాలు పాటించకపోతే మీరు నిస్సహాయులేం కాదు. మీ(కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి) ఉత్తర్వులు అమలయ్యేలా చూసుకోవాలి. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం మీకు అధికారాలు ఉన్నాయి. కావాలంటే చర్యలు కూడా తీసుకోవచ్చు."

-సుప్రీంకోర్టు.

'చెల్లింపులు జరగడం లేదు...'

పిటిషనర్ అరూషీ జైన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్.. జూన్ 18న కేంద్రం జారీ చేసిన ఆదేశాలు హేతుబద్దంగా లేవని కోర్టుకు విన్నవించారు. అధిక ముప్పు, తక్కువ ముప్పు​ అంటూ కేంద్రం చేసిన వర్గీకరణకు సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఇప్పటికీ వైద్య సిబ్బందికి వేతనాల చెల్లింపు జరగడం లేదని వెల్లడించారు.

'ఆ విషయం అంగీకరిస్తున్నాం..'

క్వారంటైన్ కాలాన్ని సెలవుగా పరిగణిస్తున్నారన్న మరో పిటిషనర్ వాదనపై స్పందించిన మెహతా.. ఈ కాలాన్ని సెలవుగా పరిగణింకూడదన్న విషయాన్ని అంగీకరిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని సూచనలు తీసుకోనున్నట్లు తెలిపారు. సరైన సమయంలోనే వేతనాలు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఆగస్టు 10కి వాయిదా

వైద్యులకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి కాదని మే 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు డాక్టర్ అరూషీ జైన్. దీంతో పాటు.. తప్పనిసరి క్వారంటైన్ కాలాన్ని సెలవుగా పరిగణించి వేతనాలు తగ్గిస్తున్నారని యునైటెడ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సైతం కోర్టు పరిగణలోకి తీసుకుంది. అనంతరం ఈ కేసులో తదుపరి వాదనలను ఆగస్టు 10కి వాయిదా వేసింది ధర్మాసనం.

జూన్ 17న..

కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న వైద్యులకు వేతనాలు అందేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాలని జూన్ 17న కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు క్వారంటైన్ సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:'కరోనా యోధులకు వేతనాలు ఇచ్చేలా చూడాలి'

ABOUT THE AUTHOR

...view details