కరోనా మహమ్మారిపై వస్తున్న నకిలీ వార్తలను అరికట్టాలని.. సరైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి 24 గంటల్లో పోర్టల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. వైరస్ కంటే భయమే ఎక్కువ మంది ప్రాణాలు తీస్తుందని ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
వలసదారుల సమస్యలపై దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది.
స్వచ్ఛంద సేవా సంస్థలకే..
దేశవ్యాప్తంగా వసతి గృహాల్లో ఉంచిన వలసదారులకు పరిస్థితిని వివరించి, వారిని సముదాయించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్దేశించింది సుప్రీంకోర్టు. ఇందుకోసం శిక్షణ పొందిన సలహాదారులను, అన్ని మతాల పెద్దలను నియమించాలని కేంద్రానికి సూచించింది. వలసదారులను ఉంచే ఆశ్రయ గృహాలను నిర్వహించే విధులను స్వచ్ఛంద సేవకులకు అప్పగించాలని.. సైనిక, పోలీసు బలగాలను ఉపయోగించి వారిని బెదిరింపులకు గురి చేయవద్దని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. యూపీలో శానిటైజేషన్ పేరిట వలసదారులపై రసాయనాలు చల్లడాన్ని తప్పుబట్టింది న్యాయస్థానం.
ఇదీ చూడండి:'ఎక్కువ మాట్లాడండి... కరోనాను జయించండి!'