ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు పథకం అమలుపై కేంద్రానికి తాజా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. లాక్డౌన్లో వలస కూలీలతో పాటు ఆర్థికంగా వెనుకబడినవారికి సబ్సిడీ ఆహార ధాన్యాలు అందేలా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకాన్ని తాత్కాలికంగా అమలు చేయొచ్చో లేదో అన్న అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. తదనంతర పరిణామాలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బీఆర్ గవైతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.
పిటిషన్లో ఏముందంటే..
దేశవ్యాప్తంగా వన్ నేషన్- వన్ రేషన్ కార్డును ఈ ఏడాది జూన్‌లో అమలు చేయాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో ఎంతో మంది వలస కార్మికులు చిక్కుకుపోయారు. వీరితో పాటు పేదలు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఒకే దేశం- ఒకే రేషన్‌కార్డు పథకాన్ని అమలు చేయాలని, దేశంలో వారందరూ ఎక్కడున్నా రాయితీతో కూడిన ఆహారధాన్యాలు అందేలా చూడాలని పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది రీపక్ కన్సల్. ఈ వ్యాజ్యంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.