పౌరసత్వ చట్టం, ప్రతిపాదిత దేశవ్యాప్త జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేపట్టారు పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. భాజపాపై ఉమ్మడి పోరుకు వ్యూహాలు రచిస్తున్నారు. దేశాన్ని రక్షించేందుకు ఏకతాటిపైకి రావాలని కోరుతూ దేశంలోని పలు విపక్ష పార్టీల నేతలు, భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు.. లేఖ రాశారు దీదీ.
దేశంలోని ప్రస్తుత పరిస్థితులను తన లేఖల్లో వివరించారు మమత. భాజపాయేతర పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి కేంద్రంలోని అమానుష పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరారు. అధికార భాజపా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు దీదీ.
" నాలోని తీవ్రమైన ఆవేదనతో ఈ రోజు మీకు లేఖ రాస్తున్నా. పౌరసత్వ చట్టం, ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్ఆర్సీపై కులంతో సంబంధం లేకుండా ఈ దేశ పౌరులు, మైనారిటీలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, ముఖ్యంగా పిల్లలు, మహిళలు భయాందోళనల్లో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు చాలా ఆందోళనగా ఉన్నాయి. దేశంలో ఉన్న అమానుష పాలనకు వ్యతిరేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. సీనియర్ నాయకులు, రాజకీయ నేతలు అందరు కలిసికట్టుగా పోరాటం చేయాలని విన్నవిస్తున్నా. కేంద్రం చేస్తున్న రాజ్యాంగ విరుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుదాం. భారతదేశ ప్రజాస్వామ్య ఆత్మను కాపాడుదాం. "
-మమతా బెనర్జీ, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి.