అక్రమార్జన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ.. తనను ముందస్తుగా విడుదల చేయాలని అభ్యర్థించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే ప్రత్యేక కోర్టుకు రూ. 10 కోట్ల జరిమానా చెల్లించారు శశికళ. వచ్చే ఏడాది జనవరి 27న ఆమె విడుదలయ్యే అవకాశం ఉందని ఇదివరకే అధికారులు స్పష్టం చేశారు.
అయితే అంతకుముందే తనను విడుదల చేయాలని కోరినట్లు శశికళ సన్నిహిత వర్గాలు తెలిపాయి. శశికళ అభ్యర్థనను జైలు శాఖ వర్గాలు ఉన్నతాధికారులకు పంపించినట్లు వెల్లడించాయి. ఈ విన్నపంపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశాయి.
జైలు నిబంధనల ప్రకారం కారాగారంలో సత్ప్రవర్తనతో మెలిగితే.. శిక్షలో ప్రతి నెల మూడు రోజుల మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రకారం శశికళకు విధించిన శిక్షలో 135 రోజులు తగ్గే అవకాశం ఉంటుంది.