మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు భాజపా-శివసేన కూటమికే మద్దతు ప్రకటించారని, వారు వీలైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటుచేయాలని సూచించారు. ఎన్సీపీ ప్రతిపక్షంలోనే ఉంటుందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ విషయం తనకు తెలియదని పేర్కొన్నారు.
శివసేన-ఎన్సీపీ ప్రభుత్వమా?
శరద్ పవార్ ముంబయిలో మీడియాతో మాట్లాడే ముందు శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ఆయన్ను కలిశారు. వీరిద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోగా... శివసేన-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడే ప్రశ్నే లేదని పవార్ తేల్చిచెప్పారు. 25 ఏళ్లుగా భాజపా-శివసేన కలిసి ఉంటున్నాయని... నేడో, రేపో మళ్లీ ఆ రెండు కలిసిపోతాయని వ్యాఖ్యానించారు.