ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోన్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు తమ దేశం టీకాను సిద్ధం చేసిందంటూ ప్రకటించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు టీకా సమర్థతపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు.
రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్ - ఎయిమ్స్ డైరెక్టర్
ప్రపంచంలో అందరి కన్నా ముందు కరోనా వ్యాక్సిన్ విడుదల చేసిన దేశం రష్యా. మహమ్మారిని నియంత్రించే ఈ టీకాపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాక్సిన్ ఎంత వరకు సురక్షితం, ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న అంశాలపై అంచనాకు రావాల్సి ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేలియా అన్నారు.
"రష్యా టీకా విజయవంతమైతే..అది ఎంతవరకు సురక్షితం, ఏమేరకు ప్రభావంతమైనది అనే అంశాలపై అంచనాకు రావాల్సి ఉంటుంది. టీకాల ప్రధాన లక్ష్యం ఎలాంటి దుష్ప్రభావాలు చూపకూడదు. అలాగే రోగనిరోధక శక్తిని ఇవ్వాలి. అంతేకాకుండా వ్యాక్సిన్‌ను భారీగా ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్‌కు ఉంది" అని వెల్లడించారు.
కాగా, రష్యా ఉత్పత్తి చేసిన టీకాకు స్పుత్నిక్-Vగా నామకరణం చేశారు. తన కుమార్తెకు కూడా టీకాను ఇచ్చినట్లు పుతిన్ వెల్లడించారు. అయితే హడావుడిగా టీకాను రిజిస్టర్ చేయించడంపై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయోగాలు పూర్తి స్థాయిలో నిర్వహించకుండానే టీకాను పంపిణీ కోసం సిద్ధం చేయడం సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. మరోవైపు ఇప్పటికే ఈ టీకాకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.