అన్నా చెల్లెళ్ల అపూరూప ప్రేమకు అద్దం పట్టే రోజు కోసం గుజరాత్ లో స్వచ్ఛమైన సంజీవని రాఖీలు తయారవుతున్నాయి. గల్వాన్ ఘటన తర్వాత చైనా ఉత్పత్తులను బహిష్కరించే ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో స్వదేశీ సేంద్రియ రాఖీలను తయారు చేస్తోంది కచ్ జిల్లాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ.
కచ్ జిల్లాలోని రామకృష్ణ పరమహంస ట్రస్ట్.. నాలుగేళ్ల క్రితమే ఓ పరిశ్రమను స్థాపించింది. గోపంచకం, ఆవు పేడ కలిపి.. రాఖీలు తయారు చేసి చౌక ధరకే విక్రయించేది. వీటికి 'సంజీవని' అని పేరు పెట్టింది. అయితే ఇన్నాళ్లు చైనా రాఖీల మెరుపులో స్వదేశీ రాఖీలు మసకగా కనిపించేవి. కానీ, ఇప్పుడు స్వదేశీ ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరింది. దీంతో సంజీవని రాఖీల ఉత్పత్తి రెండింతలు పెరిగింది.
"గతంలో మేము దాదాపు 3000 సంజీవని రాఖీలను తయారు చేశాం. కానీ, ఈ సారి 6000 రాఖీలు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మాకు ఒక్క రాఖీ తయారు చేయడానికి రూ.2.50 ఖర్చవుతుంది. దానిని దాదాపు పది రూపాయలకు విక్రయిస్తాం. "