మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మధ్య శనివారం జరిగిన 'రహస్య భేటీ' ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. భాజపా- శివసేన మధ్య అనేక విషయాల్లో పచ్చగడ్డివేస్తే భగ్గుమంటున్న పరిస్థితుల్లో.. వీరు కలుసుకోవడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. తాజాగా.. ఈ విషయంపై ఫడణవీస్ స్పందించారు. శివసేన అధికార పత్రిక సామ్నాలో ఇంటర్వ్యూ కోసం రౌత్ తనను సంప్రదించినట్టు వెల్లడించారు.
"సామ్నా కోసం ఇంటర్వ్యూ కావాలని రౌత్ నన్ను కోరారు. దీని కోసమే మేము కలిశాము. ఈ క్రమంలో నేను కొన్ని షరతులు పెట్టాను. ఎలాంటి మార్పులు లేకుండా విడుదల చేస్తేనే ఇంటర్వ్యూ ఇస్తానని స్పష్టం చేశాను. మా మధ్య రాజకీయాలకు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదు."