సాధారణంగా నెలసరి సమయాల్లో వినియోగించే న్యాప్కిన్లను వాడిపారేసిన తర్వాత అవి పర్యావరణానికి ఎంతో హాని చేస్తాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు పర్యావరణహిత శానిటరీ ప్యాడ్ల సంచులను సిద్ధం చేయాలని ఆయా సంస్థలకు సూచించింది కేంద్రం. అంతేకాకుండా వచ్చే ఏడాది నుంచి వీటిని తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్.
నేడు మహిళా దినోత్సవం సందర్భంగా పుణెలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
"పర్యావరణానికి హాని చేయని, త్వరగా భూమిలో కలిసిపోయే బ్యాగులను అందుబాటులోకి తీసుకురావాలని శానిటరీ ప్యాడ్ల తయారీదారులకు ఇప్పటికే అనేకమార్లు సూచించాం. అయినప్పటికీ వారు ప్లాస్టిక్ సంచులనే వాడుతున్నారు. ఇప్పటికీ పర్యావరణహిత సంచులను అందుబాటులోకి తీసుకురావడం లేదు. అందుకే కేంద్రం వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ పర్యావరణహిత బ్యాగులను తప్పనిసరి చేయనుంది."