నేడు ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోంది. ఆ శత్రువు మన కంటికి కనిపించదు. దాని వల్ల కలుగుతున్న నష్టాలు మాత్రం మనకు ప్రబలంగా కనిపిస్తున్నాయి. అంతిమంగా మన జీవన విధానానికే ముప్పు ఏర్పడుతోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశాలు నిర్బంధలను అమలు చేస్తున్నాయి. దీనివల్ల వైరస్ వ్యాప్తి నెమ్మదిస్తుంది కానీ పూర్తిగా అడ్డుకట్ట పడదు. పైగా ఈ ఆంక్షలు కఠినంగా ఉండాలి.
చైనాలో వీటిని కట్టుదిట్టంగా అమలు చేసి, విజయం సాధించారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇంత గట్టిగా అమలుకావడం అసాధ్యం. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం ఈ మహమ్మారి ఉద్ధృతి మరింత పెరిగితే.. వచ్చే 6-12 నెలల్లో జనాభాలో 40 శాతం మందికి సోకొచ్చు. అలాంటప్పుడు ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం రెట్టింపు కావాలి. ఐసీయూల సామర్థ్యం మూడింతలు పెరగాలి. సంరక్షకులు, వైద్య ఉపకరణాలు భారీగా అవసరం. వీటికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. ఇందుకు 'స్టాన్‌ఫర్డ్' పరిశోధకులు చేస్తున్న సూచనలివీ..
సామర్థ్యం పెంపు
ఖాళీగా ఉన్న భవనాలను తాత్కాలిక క్వారంటైన్లుగా, ఆసుపత్రులుగా మార్చాలి. ఆరోగ్యం విషమంగా లేని రోగులను అక్కడ ఉంచొచ్చు. లేదా సాంక్రమికేతర రుగ్మతలు కలిగిన వారిని ఇక్కడ పెట్టి, ప్రస్తుత ఆసుపత్రులపై భారాన్ని తగ్గించుకోవచ్చు.
సంరక్షకులకు శిక్షణ
ఆరోగ్యంగా ఉన్న వైద్య విద్యార్థులు, సిబ్బంది, బోధన సిబ్బంది, సామాజిక వలంటీర్లను ఎంపిక చేసుకోవాలి. వారి వయసు కూడా తక్కువగా ఉండాలి. కరోనా సోకి విడిగా ఉంటున్నవారికి సేవలు అందించేలా వీరికి శిక్షణ ఇవ్వాలి. మౌలిక వసతులూ కల్పించాలి.
వెంటిలేటర్ల రూపకల్పన
ఇంజినీరింగ్ కళాశాలలు, డిజైన్ సంస్థలకు బాధ్యతలు అప్పగించి, వేగంగా వెంటిలేటర్ల రూపకల్పనకు చర్యలు చేపట్టాలి. వాటికి అత్యున్నత ప్రమాణాలు అవసరం లేదు. 12 నెలలు పనిచేసేలా రూపొందిస్తే చాలు. వెంటిలేటర్ల కొరతతో ఎవరూ చనిపోయే పరిస్థితి రాకూడదు.