దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నివారణ చర్యలు వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఆంక్షలు విధిస్తూ అంతర్గత ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. సరిహద్దుల వద్ద తనిఖీలు తప్పనిసరి చేసింది. మార్చి 15 నుంచి ప్రయాణికుల కదలికలపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
అసోం, బిహార్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, బంగాల్ రాష్ట్రాల సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సరిహద్దులు దాటుతున్న వారిపై నిఘా పెంచాలని పేర్కొంది.
ఆ దేశాల సరిహద్దులు మూసివేత..
బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల సరిహద్దులను దాదాపు మూసివేయాలని ఆదేశించింది కేంద్ర హోంశాఖ. ఈ ప్రాంతాల్లోని పలు చోట్ల ఉన్న ప్రవేశ మార్గాలను కుదించి ఒకే ప్రాంతానికి పరిమితం చేయాలని ఆదేశించింది. ఎంపిక చేసిన చెక్‌పోస్టుల నుంచే దేశంలోకి ప్రవేశాలను అనుమతించాలని తెలిపింది. చెక్‌పోస్టుల ద్వారా వచ్చే ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది.
అనుమతి ఉన్న పోర్టుల నుంచే..
అనుమతించిన నౌకాశ్రయాల నుంచి మాత్రమే ప్రయాణీకులు రావాల్సి ఉంటుందని, వచ్చే ప్రతి ప్రయాణికుడు తప్పని సరిగా కరోనా స్క్రీనింగ్‌కు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:సుప్రీంలో ఇకపై అత్యవసర కేసులు మాత్రమే విచారణ