ఈశాన్య భారత ప్రజల భాష, సంస్కృతి, గుర్తింపును తమ ప్రభుత్వం కాపాడి తీరుతుందని హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు జరుగుతున్న వేళ ఈ వ్యాఖ్యలు చేశారు. చట్ట సవరణపై భయాందోళనలు అవసరం లేదని అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఝార్ఖండ్లో 4వ విడతలో శాసనసభ ఎన్నికల పోలింగ్ జరిగే ధన్బాద్లో ప్రచార సభలో పాల్గొన్నారు మోదీ. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పౌరసత్వ చట్ట సవరణపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ చట్ట సవరణతో భారతీయ ముస్లింలకు, ఈశాన్య భారత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాదని స్పష్టంచేశారు ప్రధాని.