అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం భారత పర్యటనకు రానున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా జాతిపిత మహాత్మాగాంధీ నివసించిన సబర్మతీ ఆశ్రమాన్ని అధ్యక్షుడు సందర్శించడంపై సందిగ్ధం నెలకొంది. సబర్మతీ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ట్రంప్ రాక కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
"ట్రంప్ రాక కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అధ్యక్షుడి ఆశ్రమ సందర్శనపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ అంశమై మరికొద్ది గంటల్లో విదేశాంగ శాఖ వర్గాలు నిర్ధరిస్తాయి."
-గుజరాత్ అధికార యంత్రాంగం
అగ్రరాజ్య అధ్యక్షుడి సందర్శన కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆశ్రమ కార్యదర్శి అమృత్ మోదీ ప్రకటన విడుదల చేశారు. సబర్మతీ వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారీ కటౌట్‌ను నెలకొల్పారు. అధ్యక్షుడి రాక నేపథ్యంలో ఆశ్రమ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.