శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో కేరళ రాజకీయ పక్షాల్లో, భక్తుల్లో, హిందుత్వ సంఘాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తీవ్ర నిరసనలు..
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రయత్నించింది. దీనిని వ్యతిరేకిస్తూ భక్తులు, హిందుత్వ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. కాంగ్రెస్, నాయర్ సర్వీర్ సొసైటీ, ఫార్వర్డ్ నాయర్ కమ్యూనిటీలు ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించాయి.
ఇదే సందర్భంలో కొంతమంది మహిళలు ఆలయ ప్రవేశం కోసం విఫలయత్నం చేశారు. అయితే భక్తుల తీవ్ర వ్యతిరేకతతో వారు వెనుతిరగవలసి వచ్చింది. అయితే జనవరిలో ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు.
'ఎల్డీఎఫ్'కూ కీలకమే..
పినరయి విజయన్ ప్రభుత్వానికీ సుప్రీం తీర్పు కీలకమైనదే. ఎందుకంటే శబరిమల వార్షిక తీర్థయాత్ర మరో మూడు రోజుల్లో ప్రారంభంకాబోతోంది.
మకరవిలక్కు..
నవంబర్ 16 సాయంత్రం నుంచి రెండు నెలలపాటు పశ్చిమ కనుమల్లోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మండలం 'మకరవిలక్కు' పూజలు జరుగుతాయి. కనుక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పినరయి విజయన్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. దశలవారీగా 10 వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.
సంయమనం పాటించండి..
సుప్రీం తీర్పు అయ్యప్ప భక్తులకు అనుకూలంగా వస్తుందని కేరళ భాజపా ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు సుప్రీం తీర్పు ఎలా ఉన్నా అందరూ సంయమనం పాటించాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) విజ్ఞప్తి చేసింది.
ఇదీ నేపథ్యం..
మహిళలకు అయ్యప్ప ఆలయంలోకి అనుమతిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం 2018 సెప్టెంబర్ 28న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హిందుత్వ సంస్ధలు, అయ్యప్ప భక్తులు 64 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈ ఏడాది ఫిబ్రవరి 6న విచారణను పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. సమీక్ష పిటిషన్ దాఖలు చేసిన ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చివరి నిమిషంలో మనసు మార్చుకుంది. తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఇదీ చూడండి:'ఫడణవీస్ సీఎం అని ముందే చెప్పాం.. శివసేనవి కొత్త కోరికలు'