తెలంగాణ

telangana

శబరిమల వెళ్లే మహిళలకు భద్రత కల్పనకు సుప్రీం నో

By

Published : Dec 13, 2019, 1:49 PM IST

శబరిమల ఆలయానికి వెళ్లే మహిళలకు రక్షణ కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇద్దరు మహిళా సామాజిక కార్యకర్తలు ఈ మేరకు వేసిన వ్యాజ్యాల్ని తోసిపుచ్చింది.

Sabarimala: SC declines to pass any order for safe entry of women
శబరిమల వెళ్లే మహిళలకు భద్రత కల్పనకు సుప్రీం నో

శబరిమల వెళ్లే మహిళలకు రక్షణ కల్పించాలంటూ ఇద్దరు మహిళా సామాజిక కార్యకర్తలు రెహనా ఫాతిమా, బిందు అమ్మిని దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. ఆలయంలోకి ప్రవేశించాలనుకునే మహిళలకు భద్రత కల్పించేలా కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోరగా అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వలేదని సుప్రీం కోర్టు గుర్తుచేసింది. అలా అని శబరిమల వెళ్లే మహిళలకు రక్షణ కల్పించాలని కేరళ సర్కారును ఆదేశించబోమని స్పష్టం చేసింది.

శబరిమల అంశం భావావేశాలతో కూడుకున్నదని, దాన్ని విస్ఫోటకంలా మార్చదల్చుకోలేదని పేర్కొంది న్యాయస్థానం. రివ్యూ పిటిషన్లపై విచారణ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసినందున ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది.

శబరిమల తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై విచారణ జరిపేందుకు త్వరలోనే ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్​ఏ బోబ్డే వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details