దేశంలో 'పరిశుభ్ర నగరం'గా పురస్కారాలు అందుకుంటున్న ఇండోర్ నగరంలో నిరాశ్రయులైన వృద్ధుల పట్ల మున్సిపల్ సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారు. నగరంలో నిలువ నీడ లేక అల్లాడుతున్న అభాగ్యులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి జాతీయ రహదారి పక్కన శివార్లలో వదిలేశారు. దీంతో వారంతా చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ గడిపారు.
గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు మున్సిపల్ కార్మికుల బృందం ఇలా వృద్ధులను బలవంతంగా తరలించింది. అయితే సమీపంలోని క్షిప్రా గ్రామ ప్రజలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల మున్సిపల్ సిబ్బంది వృద్ధులను తిరిగి వెనక్కి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలో ఓ వృద్ధురాలిని వాహనంలోకి నెడుతున్న దృశ్యం చూపరులను కలచివేస్తోంది.