భారత్కు భద్రతామండలి శాశ్వత సభ్యత్వం కల్పించే అంశమై ఇప్పటివరకు మద్దతు ఇస్తూ వస్తోన్న రష్యా.. ఇకముందు ఈ దిశగా సహకారం కొనసాగిస్తామని ప్రకటించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ ప్రకటించారు. భారత్, రష్యా, చైనా త్రైపాక్షిక భేటీలో భాగంగా ఈ విషయాన్ని తెలిపారు లావరోవ్. శాశ్వత సభ్యత్వానికి భారత్ బలమైన పోటీదారు అని పేర్కొన్నారు. భారత్.. భద్రతా మండలి శాశ్వత సభ్య దేశంగా అవతరిస్తుందని తమకు నమ్మకం ఉందని ఉద్ఘాటించారు.
'భారత్, చైనాకు బయటి శక్తుల సాయం అనవసరం'
అంతర్గత వ్యవహారాలు సహా ఇతర అంశాల్లో భారత్- చైనాలకు బయటి శక్తుల సాయం అనవసరమని భావిస్తున్నట్లు చెప్పారు లావరోవ్. సరిహద్దు సహా వివిధ సమస్యలను భారత్- చైనాలు ద్వైపాక్షికంగా, శాంతియుతంగానే పరిష్కరించుకుంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్షణ అధికారులు, విదేశాంగమంత్రుల స్థాయిలో ఇప్పటికే చర్చలు ప్రారంభించాయని గుర్తు చేశారు.