రష్యా తయారు చేసిన 'స్పుత్నిక్-వి' కొవిడ్ టీకాను భారీగా ఉత్పత్తి చేసేందుకు భారత్ సహకారాన్ని కోరుతూ ఆ దేశ రాయబారి అధికారిక సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మేరకు... ప్రధాన శాస్త్రీయ సలహాదారు విజయ్ రాఘవన్, వైద్య పరిశోధన శాఖ కార్యదర్శి డా. బలరాం భార్గవ, జీవసాంకేతిక శాఖ కార్యదర్శి రాణు స్వరూప్‌ను భారత్‌లోని రష్యా రాయబారి నికోలే కుదాషెవ్ కలిసినట్లు అధికారులు వెల్లడించారు.
రష్యా వ్యాక్సిన్‌కు సంబంధించి అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ ఇదివరకే ప్రకటించింది. రష్యాలోని భారత రాయబార కార్యాలయం సైతం గమలేయ పరిశోధన సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది.
"స్పుత్నిక్-వి విషయంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఏ విదేశీ వ్యాక్సిన్‌కు అయినా దేశంలో ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే ఆమోదం లభిస్తుంది. భారత్‌లో స్పుత్నిక్-వి టీకా ఉత్పత్తి చేయాలంటే డీసీజీఐ అనుమతి తప్పనిసరి."