భారతావని ఆత్మ గ్రామాల్లోనే ఉందన్నారు మహాత్మాగాంధీ. పల్లెపట్టుల సమస్యల్ని పట్టించుకోని పాలకుల ఉపేక్షాభావంతో ఆ ‘ఆత్మ’ క్షోభిస్తే దేశార్థికమే ఎంతటి సంక్షోభంలో కూరుకుపోతుందో నడుస్తున్న చరిత్ర ఎలుగెత్తి చాటుతోంది. బిస్కెట్లకు సైతం గిరాకీ పడిపోయి అన్ని రంగాలనూ తాకిన మాంద్యం సెగ, ప్రత్యక్ష పరోక్ష పన్ను రాబడుల్లో ఎకాయెకి రెండు లక్షల కోట్ల రూపాయల దాకా ప్రభుత్వ బొక్కసానికీ బొర్రె పెడుతోంది. ఉరుముతున్న మందగమనం ఉద్యోగాల్ని ఊడ్చేస్తుంటే దాని కట్టడి కోసం కార్పొరేట్ సుంకాల కోత సహా పలు రంగాలకు ఉద్దీపన చర్యల్ని ప్రకటించినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయిన నేపథ్యంలో ఎల్లుండి రానున్న కేంద్ర బడ్జెట్‌పై ఎన్నో ఆశలు ముప్పిరిగొన్నాయి. బడ్జెట్ సన్నాహకాల్లో భాగంగా అన్ని వర్గాలనుంచీ కేంద్రం ఎన్నెన్ని సూచనలు రాబట్టినా- ప్రస్తుత సంక్షోభంనుంచి గట్టెక్కడానికి అందరూ సూచిస్తున్న మార్గం ఒక్కటే. ప్రజల చేతుల్లో సొమ్ములు ఆడేలా చూసి వస్తూత్పత్తులకు గిరాకీ పెంచాలన్నదే! గ్రామీణార్థికం కుంగుబాటుకు లోను కాబట్టే దేశం ‘అభివృద్ధి మాంద్యం’లో కూరుకుపోతోందన్న ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్- పరిమిత వనరుల్ని ఉపాధి హామీ, గ్రామీణ రహదారుల నిర్మాణం వంటివాటికి మళ్ళించడం ద్వారా అక్కడి పేదలకు దన్నుగా నిలవాల్సిన అవసరం ఉందని ఏడువారాల క్రితమే సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తొలి ఎనిమిది నెలల్లో ఖర్చు చేసిన బడ్జెట్ కేటాయింపులు 70శాతం; అదే ఈ ఆర్థిక సంవత్సరం వ్యయీకరించింది కేవలం 49 శాతం! బడుగు రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ అంటూ కిసాన్ సమ్మాన్ నిధికి కేటాయింపులు రూ.75 వేల కోట్లు అయినా మొన్న డిసెంబరు చివరి నాటికి ఖర్చు చేసింది 57.6శాతం! చేసిన పనికి కూలి డబ్బులూ సకాలంలో అందక ‘ఉపాధిహామీ’ విలవిల్లాడుతుంటే, మొత్తంగా గ్రామీణార్థికమే దెబ్బతిన్న దుష్ప్రభావం- దేశ ప్రగతి రథ గమనాన్నే మందగింపజేస్తోంది. పల్లెల్ని ఆదుకొంటే అవే దేశార్థికాన్ని చేదుకొంటాయన్న ప్రాప్తకాలజ్ఞతతో సవ్యపథంలో బడ్జెట్ విధాన సేద్యం సాగాలి!
'పీఎమ్-కిసాన్' నామ మాత్రమే
‘మేము చేసే ప్రతి పనిలోనూ ‘పల్లెలు పేదలు రైతుల’ ప్రయోజనాలే కీలకంగా ఉంటాయి’- నిరుడు జులై మొదటివారంలో కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాట అది. ప్రస్తుతం 3000 కోట్ల డాలర్లుగా ఉన్న వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్ని 2022కల్లా రెట్టింపు చెయ్యాలన్న ప్రకటనలు ఓ వంక మోతెక్కుతున్నా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో అవి 16శాతం పడిపోయాయంటే ఏమనుకోవాలి? ఎరువుల సబ్సిడీని కూడా కలుపుకొంటే గత బడ్జెట్లో గ్రామాలకు కేటాయించిన మొత్తం రూ.3.40 లక్షల కోట్లు! ఎకాయెకి 70శాతం జనావళి నివసించే లక్షలాది పల్లెలకు బడ్జెట్లో కేవలం 12శాతం నిధుల కేటాయింపుతో గ్రామాభ్యుదయం ఎలా సాధ్యమో అర్థం కాదు. స్థూల దేశీయోత్పత్తిలో గ్రామాలు సమకూరుస్తున్నది 30శాతం; 50శాతం ప్రజానీకం ఆధారపడిన వ్యవసాయం వాటా 15శాతమే! రెండు హెక్టార్లలోపు సాగుభూమిగల చిన్న సన్నకారు రైతుల సంఖ్య 86శాతానికి పైబడిందని, కుటుంబ పోషణకు సరిపడ తప్ప అదనపు ఉత్పత్తి ఆయా రైతులకు సాధ్యం కావడంలేదనీ గుర్తించాల్సిందే. అలాంటి రైతుల కోసమే తెచ్చిన ‘పీఎమ్-కిసాన్’ ద్వారా బడుగు రైతు కుటుంబాలకు దక్కే భరోసా నామమాత్రం. దళారి వ్యవస్థ నిర్మూలనకోసమన్న ‘ఈ-నామ్’ వేదిక ఏర్పాటు, వచ్చే అయిదేళ్లలో కొత్తగా పదివేల రైతు ఉత్పాదక సంస్థల కూర్పు ద్వారా సన్నకారు రైతులకు ఏం ఒరుగుతుందన్నది అగమ్యం. యావత్ రైతాంగానికీ సమగ్ర ఉచిత బీమా రక్షణ ఛత్రం కల్పించి, మోసపూరిత కనీస మద్దతు ధరల యమపాశాల్ని పరిహరించడమే ప్రభుత్వాలు రైతన్నలకు చెయ్యగల మహోపకారం! దానితోపాటు గిడ్డంగులు, శీతల నిల్వ కేంద్రాల వంటివాటిని విరివిగా నిర్మించి రైతులకు అందుబాటులోకి తెచ్చే చొరవ వచ్చే బడ్జెట్లో ప్రస్ఫుటం కావాలి. ‘జై కిసాన్’ నినాదాలు జాతి కడుపు నింపవన్న స్పృహతో రైతాంగానికి గట్టిమేలు తలపెట్టే చర్యలు సత్వరం పట్టాలకెక్కాలి!