కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. ఎల్డీఎఫ్ అదే జోరు కనబరిచింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ విజయం.. పార్టీకి మరింత బలం చేకూర్చింది. 'అభివృద్ధికే మీ ఓటు' అన్న ఎల్డీఎఫ్ నినాదం ముందు ప్రతిపక్షాల ఎత్తులు ఫలించలేదు. కేరళలో జెండా పాతాలన్న భాజపా ప్రయత్నం విఫలమవగా.. వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ తన ధోరణిని కొనసాగించింది.
సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమోక్రెటిక్ ఫ్రంట్) 2015లో కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచింది. గ్రామ పంచాయతీల్లో 514, బ్లాక్ పంచాయతీల్లో 112, జిల్లా పంచాయతీల్లో 10 స్థానాల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీల్లో మాత్రం ఆధిపత్యం చెలాయించలేక పోయింది. 35 మాత్రమే గెలిచింది.
గత ఎన్నికల్లో జిల్లా పంచాయతీలోని 14 స్థానాల్లో ఎల్డీఎఫ్ కేవలం ఏడింటిలోనే గెలుపొందింది. కార్పొరేషన్లలోని ఆరు స్థానాల్లో 3 మాత్రమే గెలిచిన ఎల్డీఎఫ్.. స్వతంత్రులు, తిరుగుబాటుదారుల మద్దతుతో మరో రెండు స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది.
ఎన్ని స్థానాల్లో గెలుపు..
గ్రామ పంచాయతీలు-941
- ఎల్డీఎఫ్- 514
- యూడీఎఫ్ - 377
- ఎన్డీఏ - 22
- ఇతరులు -28
బ్లాక్ పంచాయతీలు-152
- ఎల్డీఎఫ్-112
- యూడీఎఫ్- 40
జిల్లా పంచాయతీలు(జెడ్పీ)-14
- ఎల్డీఎఫ్- 10
- యూడీఎఫ్-4
మునిసిపాలిటీలు-86
- యూడీఎఫ్-45
- ఎల్డీఎఫ్-35
- ఎన్డీఏ- 2
- ఇతరులు- 4