కరోనా కేసులను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా భారత వైద్య పరిశోధన మండలి కీలక నిర్ణయం తీసుకుంది. జ్వరం, దగ్గు, గొంతులో ఇబ్బంది, జలుబు వంటి ఫ్లూ లక్షణాలు ఉన్నవారందరికీ ఏడు రోజుల్లోపు రియల్‌టైమ్ రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్-పాలీమెరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్టీ-పీసీఆర్) పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్దేశించింది. ఈ పరీక్షల్లో నెగటివ్ వస్తే ఏడు రోజుల తర్వాత యాంటీ బాడీ టెస్ట్‌లు చేయాలని పేర్కొంది.
ఈ మేరకు కరోనా వ్యూహాన్ని సవరించిన ఐసీఎంఆర్.. వైరస్ సోకిన వారితో ప్రత్యక్ష సంబంధమున్న వారిని..ముప్పు ఎక్కువగా ఉన్నవారిగా పరిగణించాలని సూచించింది. వారు సన్నిహితంగా మెలిగిన నాటి నుంచి 5-14 రోజుల మధ్యలో... ఒకసారి పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.