సమాజంలో జరిగే సంఘటనలను వ్యాపార అవకాశాలుగా మార్చుకోవడంలో వాణిజ్య వర్గాలు ముందుంటాయి. ప్రత్యేక సందర్భాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటి వరకూ ప్రచారాన్ని చేసేవి. తాజాగా ఓ అడుగు ముందుకేశాయి.
బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ ట్విట్టర్లో.. అరటిపండ్లపై చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. జులై 22న ఓ హోటల్లో రెండు అరటిపండ్లకు రూ. 442.50 బిల్లు వేయడాన్ని నిరసిస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని వ్యాపార ఆలోచనగా మార్చుకుని తమ వస్తువులు రెండు అరటి పండ్ల ధరతో పోల్చితే ఎంత తక్కువో...అంతే ధరకు ఎన్ని వస్తువులు వస్తాయో.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే వ్యాపార అస్త్రంగా మలిచేశాయి.
'రూ. 442' ఘటనతో అంతే మొత్తంలో అమెజాన్లో కొనగలిగే వస్తువులపై ఆ సంస్థ ఓ పోస్ట్ పెట్టింది.
ఐసింగ్ సంస్థ... రెండు అరటి పండ్లతో తమ వస్తువును పోలుస్తూ రూ.280కే పొందండి అని వెల్లడించింది.
పాలసీ బజార్.కామ్ ఓ అడుగు ముందుకేసి రెండు అరటి పండ్ల ఖర్చుతోనే అద్భుతమైన బీమా అని ప్రచారం చేస్తోంది.
రూ. 99తో పిజ్జాను కొనే బదులు రూ. 442తో ఒక పండు కొంటారా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రచారానికి దిగింది పిజ్జా హట్.