నాలుగు నెలల్లో రామమందిర నిర్మాణం చేపడతామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భాజపా రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకోవడం లేదన్న కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యలకు మధ్యప్రదేశ్లో నిర్వహించిన పౌరచట్ట అనుకూల ప్రచారం వేదికగా సమాధానమిచ్చారు షా. ఆకాశాన్ని చిన్నగా చూపగలిగేంత పెద్దదైన మందిర నిర్మాణం చేపడతమన్నారు.
పౌరచట్టంపై విపక్షాలు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి. పౌరచట్టంతో దేశంలోని మైనారిటీల పౌరసత్వానికి ప్రమాదమన్న విపక్షాల ఆరోపణలు నిజం కాదన్నారు. మైనారిటీల పౌరసత్వాన్ని తొలగించే అంశమై రాహుల్ గాంధీ, మమత బెనర్జీలు నిరూపించాలని సవాల్ విసిరారు.
"కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, మమత బెనర్జీ అంతా ఏకమై దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. పౌరచట్టం మైనారిటీల పౌరసత్వాన్ని తొలగిస్తుందని ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ, మమత బెనర్జీలకు ఈ రోజు నేను సవాలు చేస్తున్నాను. పౌరచట్ట సవరణలోని ఏ అధికరణలోనైనా పౌరసత్వాన్ని తొలగించే అంశం ఉందని నిరూపించగలరా?. అలాంటి నిబంధన పౌరచట్టంలో లేనేలేదు. పౌరసత్వాన్ని అందించే నిబంధనలు మాత్రమే ఉన్నాయి.