భాజపా కాంగ్రెస్ మాటల యుద్ధం అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో భాజపాపై ఓటుకు నోటు ఆరోపణలు చేసింది కాంగ్రెస్. రాష్ట్రానికి చెందిన భాజపా కీలక నేతల వద్ద పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడిందని చెప్పింది. మోదీతో సహా ముఖ్యమంత్రి పెమా ఖండు, ఉప ముఖ్యమంత్రి ఛౌనా మైన్ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.రాష్ట్ర భాజపా అధ్యక్షుడు తాపిర్ గావ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలన్నారు.
"అరుణాచల్ పాసిఘాట్‌లో ఈరోజు మోదీ సభ జరుగుతోంది. సంచలన విషయమేమిటంటే భాజపా సీఎం పెమాఖండు, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు తాపిర్ గావ్ నుంచి రూ.1.8 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. "
- రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
డబ్బును ఎన్నికల సంఘం అధికారులు స్వాధీనం చేసుకుంటున్న చిత్రాలను ప్రదర్శించారు సుర్జేవాలా. ఈశాన్య రాష్ట్రాల్లో డబ్బు బలంతో గెలవాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వీడియోలు అధికారికమైనవో లేదో తెలియదని, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని సుర్జేవాలా స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తలూ ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
ఖండించిన భాజపా
కాంగ్రెస్ ఆరోపణలను అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు తోసిపుచ్చారు.
"ఇది పూర్తిగా తప్పుడు ఆరోపణ. ఓ అభ్యర్థి నుంచి ఈసీ డబ్బులు స్వాధీనం చేసుకుంది అని ఉదయమే తెలిసింది. డబ్బులు ఎవరివి? ఎక్కడివనేది ఈసీ చూసుకుంటుంది. ఓటుకు నోటు అనేది కాంగ్రెస్ సంప్రదాయం. అయితే ఆ అభ్యర్థి భాజపా వ్యక్తేనని చెబుతున్నారు."
- పెమాఖండు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి
"ఇందులో ముఖ్యమంత్రి పెమాఖండు పాత్ర గానీ, నా పాత్ర గానీ లేదు. పార్టీకి చెందిన ఓ వ్యక్తి, మరో మాజీ ఎమ్మెల్యే వద్ద డబ్బులు దొరికాయి. అవి వారి సొంత డబ్బులు. వాటితో భాజపాకు ఎలాంటి సంబంధం లేదు."
-తాపిర్ గావ్, అరుణాచల్ ప్రదేశ్ భాజపా అధ్యక్షుడు
ఇదీ చూడండి:భారత్ భేరి: తమిళ కింగ్‌మేకర్ దినకరన్?