రైల్వే పరిరక్షణ దళం (ఆర్‌పీఎఫ్) పోలీసులు భారీస్థాయి ఈ- టికెట్ రాకెట్‌ను భగ్నం చేశారు. ఈ రాకెట్‌కు ఉగ్రవాద నిధులకు సంబంధమున్నట్లు అనుమానిస్తున్నారు. తత్కాల్ టికెట్లను సాంకేతికంగా పెద్దఎత్తున కొల్లగొడుతున్న గులాం ముస్తఫా (28) అనే వ్యక్తిని భువనేశ్వర్‌లో అరెస్టు చేశారు. ఇతనికి పాకిస్థాన్, బంగ్లాదేశ్, దుబాయ్‌లలోని ఉగ్రవాద సంస్థలతో లంకె ఉన్నట్లు భావిస్తున్నారు.
"ముస్తఫా అలియాస్ హమీద్ అష్రఫ్ వద్ద ఐఆర్‌సీటీసీ వ్యక్తిగత ఖాతాలు (ఐడీలు) 563 ఉన్నాయి. దాదాపు 2400 ఎస్‌బీఐ శాఖలు, 600 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు శాఖల జాబితా అతని వద్ద లభ్యమయింది. వాటన్నింటిలోనూ నిందితుడికి ఖాతాలున్నట్లు అనుమానిస్తున్నాం. నెలకు రూ.10-15 కోట్ల మేర ఆదాయం లభించే ఈ-టికెట్ రాకెట్ ముఠాలో ప్రధాన సూత్రధారి అతడే"
- అరుణ్‌కుమార్,ఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్
అక్రమ నగదు చలామణి, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటివాటితో అతడికి సంబంధం ఉన్నట్లు తమకు లభ్యమైన సమాచారాన్నిబట్టి అర్థమవుతోందని వివరించారు.
సొంతంగా సాంకేతిక బృందం
మదర్సాలో చదువుకున్న ముస్తఫా సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఎదిగాడు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో తత్కాల్ టికెట్లను తీసుకోవడానికి చేసుకున్న ఏర్పాట్లు దర్యాప్తు అధికారుల్ని నివ్వెరపరిచాయి. ఐఆర్‌సీటీసీలో లాగిన్ అయ్యేందుకు, టికెట్ బుకింగ్‌కు నమోదు చేయాల్సిన సంకేతాలు (క్యాప్చాలు) గాని, బ్యాంకు ఓటీపీ గానీ అవసరం లేని రీతిలో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసుకుని ఉపయోగిస్తున్నట్లు బయటపడింది. డార్క్‌నెట్, లైనక్స్ ఆధారిత హ్యాకింగ్ వ్యవస్థల్ని చేరుకునేందుకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్ అతని లాప్‌టాప్‌లో ఉంది.
సాధారణంగా ఐఆర్‌సీటీసీ ద్వారా తత్కాల్ టికెట్ తీసుకోవడానికి 2.55 నిమిషాలు పడితే ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో 1.48 నిమిషాల్లోనే పని పూర్తి చేస్తున్నట్లు గుర్తించారు. వేర్వేరు యూజర్ ఐడీలు, ముందుగా నింపి ఉంచిన సమాచారంతో ఏక కాలంలో అనేక టికెట్లు తీసుకునేందుకు సొంత సాఫ్ట్‌వేర్ దోహదం చేస్తోంది. బెంగళూరులో ప్రస్థానం మొదలుపెట్టిన ఓ సాధారణ దళారి.. అక్రమ మార్గాన తత్కాల్ టికెట్లు తీసుకోవడానికి కొద్దికాలంలోనే కొంతమంది ప్రోగ్రామర్లను నియమించుకునే స్థాయికి ఎదిగిన తీరు దర్యాప్తులో బయటపడింది. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఈ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోందని అరుణ్‌కుమార్ చెప్పారు.
లాప్‌టాప్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఫోన్ నంబర్లు
ముస్తఫా లాప్‌టాప్‌లో ఎన్‌క్రిప్టెడ్ సమాచారం ఉంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియా, నేపాల్ తదితర దేశాలకు చెందినవారి ఫోన్ నంబర్లు, ఆరు వర్చువల్ నంబర్లు గుర్తించాం. నకిలీ ఆధార్ కార్డుల తయారీ అప్లికేషన్ కూడా ఉంది. పాకిస్థాన్‌కు చెందిన మతపరమైన సంస్థకు తాను అనుచరుడినని ముస్తఫా వెల్లడించాడు.
- అరుణ్‌కుమార్,ఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్
క్లౌడ్ సర్వర్లను నిర్వహించేందుకు ముస్తఫా ఏర్పాటు చేసుకున్న సాంకేతిక బృందం.. డబ్బు సంబంధిత లావాదేవీలు చూసుకుంటూ హవాలా ఖాతాలు, క్రిప్టో కరెన్సీ ద్వారా దానిని అతనికి చేరవేసేదని చెప్పారు. కావాల్సినన్ని టికెట్లను వేగంగా తీసుకోవడానికి వీలుగా ఇరవై చొప్పున యూజర్ ఐడీలను ఒక ప్యానెల్‌గా రూపొందించి, నెలకు రూ.28,000 చెల్లించినవారికి దానిని ఇచ్చేవారని వివరించారు. అక్రమ సాఫ్ట్‌వేర్‌ను వాడేవారు దేశవ్యాప్తంగా 20 వేల మంది వరకు ఉంటారని చెప్పారు. ముఠాకు నెలకు రూ.10-15 కోట్ల నల్లధనం ఈ రూపంలో జమ అవుతోందని చెప్పారు.
గురూజీగా పిలిచే మరో కీలక వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు పోలీసులు. 2019లో యూపీలో ఓ పాఠశాలలో చోటు చేసుకున్న బాంబు పేలుడులో ముస్తఫా పాత్ర ఉందని తేలింది. పది రోజుల పాటు ఐబీ, ఈడీ, ఎన్‌ఐఏ, కర్ణాటక పోలీసులు అతన్ని విచారించారు. ముస్తఫా స్వస్థలం ఝార్ఖండ్.