దేశాభివృద్ధికి గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు ముఖ్యపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. సహకార-పోటీతత్వ సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరుగుతోన్న 50వ గవర్నర్ల సదస్సును ప్రారంభించారు కోవింద్. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా ప్రసంగించారు కోవింద్.
"దేశ ప్రజల సాదకబాధకాల గురించి తెలిసిన గవర్నర్లు ఉండటం వల్ల దేశం వారి నుంచి పూర్తి ప్రయోజనాలను పొందుతోంది. రాజ్యాంగ విలువను పరిరక్షించడం ఒక్కటే గవర్నర్ల పాత్ర కాదు. ఆయా రాష్ట్రాల ప్రజల సంక్షేమానికి సైతం కట్టుబడి ఉండాలి. మనమందరం ప్రజాసేవకులం. ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాలి. సహకార-పోటీతత్వ సమాఖ్య వ్యవస్థలో గవర్నర్లది కీలక పాత్ర. "
- రామ్నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి.
ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.