ఎవరైనా గొప్ప ఘనతలను సాధిస్తే "వారికి ఆకాశమే హద్దు" అంటాం. కానీ అంతరిక్ష పరిశోధనా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన వారికి మాత్రం ఆకాశం ఓ ప్రయోగశాల మాత్రమే. చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్ రీతూ కరిధాల్, ప్రాజెక్టు డైరెక్టర్ ముత్తయ్య వనిత ఈ ఘనతతో తమ పేర్లను అంతరిక్ష పరిశోధన రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 69 ప్రముఖ సైన్స్ అకాడమీల్లో 12 శాతం మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రాజెక్టును ముందుండి నడిపించారు రీతూ కరిధాల్, ముత్తయ్య వనిత.
అంచెలంచెలుగా ఎదిగి..
చంద్రయాన్ -2 ప్రాజెక్టులో మిషన్ డైరెక్టర్‌గా రీతూ కరిధాల్ నియామకం ఒక్క రోజుతో సాకారం కాలేదు. ఓ వైపు పరిశోధనలు, మరోవైపు కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ఇస్రో చేపట్టిన మంగళ్యాన్కు డిప్యూటీ ఆపరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు రీతూ కరిధాల్. ఆ అనుభవంతో చంద్రయాన్-2కు వచ్చేసరికి మిషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మిషన్ పూర్తి బాధ్యతలు తన భుజానికెత్తుకున్నారు. చంద్రయాన్ ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. ఇతర విభాగాలు, శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రయోగం విజయానికి కృషిచేశారు.
విజయ ప్రస్థానం
చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్‌గా కీలకపాత్ర పోషించిన రీతూ కరిధాల్ లఖ్‌నవూ విశ్వవిద్యాలయం నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. బెంగళూరులోని ఐఐఎస్సీలో పీజీ చేశారు. 1997లో ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. 2007లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతులు మీదుగా యువ శాస్త్రవేత్త పురస్కారాన్ని అందుకున్నారు. మంగళ్‌యాన్, చంద్రయాన్-2లకు పనిచేయడంద్వారా 'రాకెట్ ఉమన్ ఆఫ్ ఇండియా'గా గుర్తింపు పొందిన రీతూ కరిధాల్.. అభిరుచి, నిజాయితీ ఉంటే లక్ష్యాన్ని సాధించడం కష్టమేమీ కాదంటారు.