లైవ్ వీడియో: బైకర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి తమిళనాడు కంబం-ఉత్తమపాలెయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనదారుడి ఏమరపాటు వల్ల జరిగిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.ఈనెల 3న భార్య రేణుకతో కలిసి శివనంది బైక్పై వస్తున్నాడు. వేగంగా వస్తున్న బస్సును గమనించకుండా పెట్రోల్ బంకులోకి వెళ్లేందుకు వాహనాన్ని కుడివైపు తిప్పాడు. ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అయినా రెండు వాహనాలు ఢీకొన్నాయి. శివనంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రేణుక తీవ్రంగా గాయపడింది. సడెన్ బ్రేక్ కారణంగా ముందు సీట్లో కూర్చున్న టికెట్ చెకింగ్ సిబ్బంది విజయ్ అద్దాల్లోంచి ఎగిరిపడి అదే బస్సు కింద పడి, మరణించాడు.అదే సమయంలో అటుగా వెళ్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది బస్సు. ఆ బైక్పై ఉన్న కత్తిర్వల్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం రేణుక, కత్తిర్వల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.క్షణాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.