గత రెండు సంవత్సరాలుగా ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు పెరిగిపోయాయని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ అన్సారియా సమర్పించిన కార్యాచరణ నివేదిక పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సూక్ష్మ స్థాయిలో హైకోర్టుల పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడింది.
ఈ నివేదిక ప్రకారం ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై 4,859 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2020 మార్చిలో ఈ సంఖ్య 4,442గా ఉంది. ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసుల్లో యూపీ అగ్రభాగాన ఉండగా, బిహార్ రెండో స్థానంలో ఉంది.
విచారణ వేగానికి వీరిని నియమించండి
ప్రతి జిల్లాలో సెషన్స్, మేజిస్ట్రేట్ స్థాయిల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని హైకోర్టులు స్వాగతించాయని అమికస్ క్యూరీ నివేదిక పేర్కొంది. జోన్లవారీగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని మరికొన్ని హైకోర్టులు సూచించాయని తెలిపింది. ప్రతి కోర్టుకు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టులు లేఖలు రాశాయని వెల్లడించింది. కేసుల విచారణ వేగవంతానికి వీరంతా సహకరించాలని పేర్కొంది.
సాక్షుల విచారణకు ప్రత్యేక కోర్టులో భద్రమైన గది ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. ప్రతి కోర్టులో ఒక వీడియో కాన్ఫరెన్స్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఈ వ్యయాన్ని కేంద్రం భరించాలని పేర్కొంది.