కరోనా కారణంగా మున్ముందు పెను సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ(నల్సా) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. ఎవరూ ధైర్యం కోల్పోకుండా, నిబద్ధతతో వాటిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
పేదలకు వేగంగా న్యాయ సహాయం అందించడానికి సంబంధించిన విధానాలతో రూపొందించిన ప్రత్యేక హ్యాండ్‌బుక్‌ను ఆయన గురువారం విడుదల చేశారు. అనంతరం వెబినార్ ద్వారా రాష్ట్రాల న్యాయ సేవల ప్రాధికార సంస్థల ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్లు, సభ్య కార్యదర్శులు, హైకోర్టు న్యాయసేవల కమిటీల అధ్యక్షులు, జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థల ఛైర్మన్లు, కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించారు.
"మూడు నెలలు గడిచినా పరిస్థితి ఇంకా నియంత్రణలోకి రాలేదు. కుటుంబాల్లో హింస పెరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. చిన్నారులపై లైంగిక వేధింపులు అధికమవుతుండటాన్నీ చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు మనల్ని ఆశ్రయించలేని పరిస్థితులు ఉంటే.. మనమే వారి వద్దకు వెళ్లి న్యాయం చేయాలి. ఇలాంటి సమస్యలను గుర్తించి మనం ఇప్పటికే వన్‌స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో మహిళా న్యాయవాదుల ద్వారా టెలిఫోన్ సేవలు కొనసాగిస్తున్నాం. ఇకముందూ ఇదే ఒరవడిని కొనసాగించాలి"