భారత దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని యోచిస్తోంది. 2021 కొత్త ఏడాది లోకి అడుగిడిన నేపథ్యంలో వచ్చే దశాబ్ద కాలానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో ప్రధానంగా భారీ బరువును మోసుకెళ్లగల రాకెట్లు, పునర్వినియోగ సాటిలైట్ లాంచ్ వెహికిల్, సెమీ-క్రయోజనిక్ ఇంజిన్ వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.
స్వల్పకాలిక లక్ష్యాల్లో తన తొలి చిన్న సాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎస్ఎల్వీ)ని జియో-ఇమేజింగ్ సామర్థ్యంతో పనిచేసేలా చేయటం, జాబిల్లి పైకి మూడో మిషన్ చంద్రయాన్-3, తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1, భారత తొలి డేటా రిలే సాటిలైట్ వంటివి ఉన్నాయి.
ఈ మేరకు కొత్త ఏడాది సందేశంలో కీలక విషయాలు వెల్లడించారు ఇస్రో ఛైర్మన్ కె.శివన్.
"ఈ ఏడాది గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న తొలి మానవరహిత విమానం మరో కీలక మైలురాయిగా మారనుంది. దశాబ్ద కాలానికి రచించిన ప్రణాళికలో ఇస్రోకు చెందిన అన్ని కేంద్రాలు, యూనిట్లు పాలుపంచుకున్నాయి. ఈ దశాబ్దంలో విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ భారీ బరువులను మోయగల రాకెట్లను తయారు చేయటంలో నిమగ్నమవనుంది. అలాగే పాక్షిక, పూర్తి స్థాయిలో పునర్వినియోగ రాకెట్లు, స్క్రామ్‌జెట్ ఇంజిన్ పరిశోధనలో పురోగతిని సాధిస్తుంది. వచ్చే దశాబ్దంలో బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ కోసం ఉపగ్రహ కూటమి ఏర్పాటు, ఎలక్ట్రిక్ శాటిలైట్ ప్లాట్‌ఫాం, అన్ని అప్లికేషన్ ప్రాంతాల్లో అధిక పనితీరు గల ఉపగ్రహాలకు ప్రాధాన్యం ఉంటుంది. "
- కే శివన్, ఇస్రో ఛైర్మన్.
స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ).. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించనున్న అటామిక్ గడియారం, ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ ఆంప్లిఫయర్ (టీడబ్ల్యూటీఏ)ల అభివృద్ధి కోసం కృషి చేయనుందని తెలిపారు శివన్. ఎన్ఏసీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)లు.. వినియోగదారుల అంచనాలను చేరుకునేందుకు ఉపగ్రహ డేటా సేవలపై కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే.. సెమీ కండక్టర్ ల్యాబోరేటరీ (ఎస్సీఎల్).. దేశంలో బలమైన మైక్రో ఎలక్ట్రానిక్ బేస్‌ను రూపొందించటం, అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డొమైన్ కోసం కృషి చేయనుందని తెలిపారు.
ఇదీ చూడండి:'2021..డీఆర్డీవోకు ఎగుమతుల సంవత్సరం'