రైల్వేలో పదవీ విరమణ పొంది మూడు దశాబ్దాలు గడచినా.. ఆ సంస్థపై అంతులేని ప్రేమను చాటుకున్నాడో వ్యక్తి. రైళ్లను, రైలు ప్రయాణాన్ని అమితానందంగా ఆస్వాదించే రిటైర్డ్ ఉద్యోగి రోహిదాస్ షిండే.. ఏకంగా తన ఇంటినే రైలు బోగిలా నిర్మించారు. ఇరువైపులా రెండు తలుపులతో కూడిన ఆ గృహం.. అచ్చం రైలును తలపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఆ తలుపులకు అమర్చిన సైన్‌బోర్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా మిరాజ్‌కు చెందిన షిండే.. 1950లో రైల్వే ఉద్యోగిగా చేరారు. పుణె, హుబ్లీ వంటి ప్రధాన రైల్వే కేంద్రాల్లో పనిచేసిన ఆయన.. 1988లో ఉద్యోగ విరమణ పొందారు. భార్య, ఆరుగురు కుమారులు, ఓ కుమార్తె. ఉద్యోగం చేసినంత కాలం చిన్నపాటి రైల్వే క్వార్టర్స్‌లోనే జీవనం సాగించారు షిండే.
తండ్రి ఆశయం నెరవేర్చిన కొడుకు
ఆ చిన్న ఇంట్లో వీరి పెద్ద కుటుంబం ఇమడలేక నానా అవస్థలు పడేవారట. దీంతో ఎలాగైనా ఓ ఇంటిని సొంతం చేసుకోవాలనే తన తండ్రి కలను నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు షిండే కుమారులు. అందులో భాగంగానే సుభాశ్నగర్లో వినూత్న రీతిలో ఓ ఇంటిని నిర్మించారు ఆయన చిన్న కొడుకు అనిల్ షిండే.