కశ్మీర్:18వ రోజూ మొబైల్, అంతర్జాల సేవల నిలిపివేత అధికరణ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్లో విధించిన ఆంక్షలు క్రమక్రమంగా సడలిస్తున్నప్పటీ.. అంతర్జాల సేవల నిలిపివేత వరుసగా 18వ రోజు కొనసాగుతోంది. తాజాగా మరిన్ని ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు. జన జీవనం మెరుగవుతోంది. కానీ చాలా ప్రాంతాల్లో మార్కెట్లు, దుకాణాలు తెరుచుకోలేదు. కశ్మీర్ లోయలో పరిస్థితులు శాంతియుతంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బలగాల మోహరింపు కొనసాగుతుందని తెలిపారు.
ప్రజారవాణాకు నో..
కశ్మీర్లో ఆంక్షల సడలింపుతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. కానీ ప్రజా రవాణా ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లాల మధ్య తిరిగే క్యాబులు, ఆటోలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి.
విద్యార్థుల గైర్హాజరు...
ప్రభుత్వ ఆదేశాలతో కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు తెరుచుకున్నాయి. ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నప్పటికీ... విద్యార్థుల గైర్హాజరు కొనసాగుతోంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయనే ఆందోళనతో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపేందుకు భయపడుతున్నారు.
ఇదీ చూడండి: ఆర్టికల్ 370 రద్దుపై భాజపా దేశవ్యాప్త ప్రచారం