దిల్లీలోని కస్తూర్భా ఆసుపత్రికి చెందిన రెసిడెంట్ డాక్టర్లు సామూహికంగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. మూడు నెలలుగా జీతాలు అందకపోవడమే ఇందుకు కారణమని కస్తూర్భా ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డా. సుశీల్ కుమార్ వెల్లడించారు.
"మూడు నెలలుగా రెసిడెంట్ డాక్టర్లకు జీతాలు అందడం లేదు. కానీ సమ్మె చేసేందుకు ఇది సరైన సమయం కాదు. అందుకే సామూహికంగా రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డాం. మేము సేవ చేయడం ఆపలేదు. ఈ ఆసుపత్రి మాకు వేతనాలు ఇవ్వలేకపోతే.. వేరే హాస్పిటల్లో మా సేవలు అందిస్తాం."
-- డా. సుశీల్ కుమార్, రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ కస్తూర్భా హాస్పిటల్ అధ్యక్షుడు.
'కరోనా వారియర్స్' అని ప్రజలు తమను గౌరవించడం ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ.. జీతాలు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు సుశీల్.
ఈ నెల 16లోగా వేతనాలు చెల్లించకపోతే సామూహిక రాజీనామాలు చేయక తప్పదని ఆసుపత్రి అదనపు ఎమ్ఎస్కు లేఖ రాశారు వైద్యులు. కరోనాపై పోరులో తమ ప్రాణాలు, తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను ఫణంగా పెట్టి సేవ చేస్తున్నామని.. కానీ జీతాలు కూడా ఇవ్వకపోవడం వల్ల ఇంటి అద్దె, ప్రయాణ ఖర్చులు, కనీస నిత్యావసరాలు కూడా కొనుక్కోలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నారు వైద్యులు.