కరోనా వైరస్‌ను 20 నిమిషాల్లోనే నిర్ధరించగల ప్రత్యేకమైన కిట్‌ను ఐఐటీ- హైదరాబాద్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ టెస్ట్ కిట్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆర్టీ- పీసీఆర్‌పై ఆధారపడి పనిచేయదని స్పష్టం చేశారు.
ఈ కిట్ తయారు చేసేందుకు రూ.550 ఖర్చయినట్లు పరిశోధకులు తెలిపారు. అయితే భారీ సంఖ్యలో ఉత్పత్తి చేస్తే ఈ వ్యయాన్ని రూ.350కి తీసుకురావచ్చని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని ఈఎస్ఐ వైద్య కళాశాలలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన అనంతరం ఐసీఎంఆర్ నుంచి అనుమతి కోరారు.
"మేం అభివృద్ధి చేసిన కిట్ ద్వారా 20 నిమిషాల్లోనే ఫలితాన్ని పొందవచ్చు. ఇందుకోసం కరోనా ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన జన్యుక్రమాన్ని గుర్తించాం. ఆర్టీ- పీసీఆర్ లేకుండానే పనిచేయటం దీని ప్రత్యేకత. దీన్ని ప్రోబ్ ఫ్రీ పద్ధతిలో రూపొందించాం. అందువల్ల దీని ఖర్చు చాలా తక్కువ. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇది కచ్చితమైన ఫలితాలను ఇస్తుంది."