తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో అట్టహాసంగా గణతంత్ర వేడుకలు - REPUBLIC DAY LIVE UPDATES

REPUBLIC DAY CELEBATIONS
71వ 'గణతంత్ర' వేడుకలకు సర్వం సిద్ధం

By

Published : Jan 26, 2020, 8:17 AM IST

Updated : Feb 18, 2020, 10:49 AM IST

12:28 January 26

సైనిక సంపత్తిని ప్రపంచానికి చాటిచెప్పిన 'గణతంత్రం'
 

71వ గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా అట్టహాసంగా సాగింది. దిల్లీ రాజ్​పథ్​లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్​ అధ్యక్షుడు జాయిర్​ బోల్సొనారో హాజరయ్యారు. 

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, భాజపా అగ్రనేత అడ్వాణీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, గులామ్​ నబీ ఆజాద్​, వివిధ పార్టీల అగ్రనేతలు గణతంత్ర దినోత్సవంలో పాలొన్నారు. వేలాది మంది ప్రజలు రాజ్​పథ్​కు తరలి వచ్చారు.

సైనిక సంపత్తి...

భారత దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెబుతూ సైనికులు భారీ కవాతు నిర్వహించారు. త్రివర్ణ జెండాకు వందనం చేస్తూ ముందుకు సాగారు. వజ్ర, భీష్మ యుద్ధ ట్యాంకులు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించాయి. రుద్ర హెలికాప్టర్​ చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'ఐఎన్​ఎస్​ విక్రాంత్'​ విమాన వాహకనౌక నమూనాను నౌకదళం ప్రదర్శించింది. డీఆర్​డీఓకు చెందిన భారత ఉపగ్రహ విధ్వంసక క్షిపణి 'ఏ-సాట్'​ ఆయుధ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయుధ వ్యవస్థ 'ధనుశ్​'ను తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించారు. 

సుకోయ్​-30ఎమ్​కేఐ యుద్ధ విమానంతో వాయుసేన చేసిన 'త్రిశూల' విన్యాసాలు వీక్షకులను కట్టిపడేశాయి. 

శకటాలు.. నృత్యాలు...

భారత్​లోని వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆయా ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పాయి. వివిధ అంశాలను ఇతివృత్తంగా చేసుకుని మొత్తం 22 శకటాలు రాజ్​పథ్​లో సందడి చేశాయి. 

వివిధ సంస్కృతులకు చెందిన వారు నృత్యాలు చేస్తూ అలరించారు. వీటిని చూసి బ్రెజిల్​ అధ్యక్షుడు మంత్రముగ్ధులయ్యారు.

11:34 January 26

గగనతల గర్జన-సుఖోయ్ 30 ఎంకేఐ

ఇటీవల తంజావురు సైనిక స్థావరంలో ప్రవేశపెట్టిన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం త్రిశూల ఆకారంలో రాజ్​పథ్​లో సందడి చేసింది. వింగ్ కమాండర్లు నీలేశ్ దీక్షిత్, కరన్ దోర్గాల సారధ్యంలో సుఖోయ్ చేసిన విన్యాసాలు ఆద్యంతం అలరించాయి.

11:28 January 26

ఆకట్టుకున్న వాయు విన్యాసాలు

గగనతలంలో భారత బలాన్ని చాటేలా హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలను ప్రదర్శించింది వాయుసేన. ముందుగా చినూక్ హెలికాఫ్టర్లు రాజ్​పథ్​లో సందడి చేశాయి. వాటిని అపాచి హెలికాఫ్టర్లు అనుసరించాయి. డోర్నియర్, సీ-130 జే, నేత్ర, సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానాలు  శ్రేణిగా వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేకంగా జాగ్వార్ శ్రేణికి చెందిన ఐదు విమానాలు జట్టుగా వచ్చి రాజపథ్ ఆహూతులకు ఆనందాన్ని కలిగించాయి.

11:17 January 26

సాహస బాలలకు రాజ్​పథ్ గౌరవం

49 సాహస బాలలను రాజ్​పథ్​లో ఊరేగించారు. ధైర్యసాహసాలు, సృజనాత్మకత, క్రీడారంగం, సామాజిక సేవ తదితర విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ సాహస బాలల అవార్డు అందిస్తారు. రాజ్​పథ్​లో ఊరేగిస్తారు.  

11:04 January 26

కశ్మీర్​ నుంచి కన్యాకుమారి దాకా..

కేంద్ర పబ్లిక్ వర్క్స్  విభాగం వారు ఏర్పాటు చేసిన శకటం ఆహూతులను అలరించింది. కన్యాకుమారిలో వివేకానంద స్మారకం, దాల్​ సరస్సు వద్ద చేపట్టిన శిఖర నిర్మాణం ఇతివృత్థాలుగా నమూనాలుగా ప్రదర్శించింది పబ్లిక్ వర్క్స్ విభాగం.

10:54 January 26

గిరిజన మ్యూజియం ఇతివృత్థంతో మధ్యప్రదేశ్ శకటం

గిరిజన మ్యూజియం ఇతివృత్థంగా మధ్యప్రదేశ్ చేసిన ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్ స్థానిక దస్సెహ్రా ఉత్సవాన్ని నమూనాగా ప్రదర్శించింది.

10:49 January 26

సంస్కృతిని చాటేలా శకటాల ప్రదర్శన

భారతీయ సంస్కృతిని చాటేలా వివిధ రాష్ట్రాల శకటాలు రాజ్​పథ్​లో ప్రదర్శన నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాయి. తమిళనాడు శకటం మొదటగా ప్రదర్శన నిర్వహించింది. గుజరాతి శకటం ఆహూతూలను ఆకట్టుకుంది.  భారతీయ సంస్కృతిని చాటిన శకటాల ప్రదర్శనను ముఖ్య అతిథి బొల్సోనారో ఆసక్తిగా తిలకించారు.

10:26 January 26

ఆకట్టుకున్న ఐఎన్​ఎస్ విక్రాంత్

ఐఎన్​ఎస్ విక్రాంత్ ఇతివృత్తంతో రూపొందించిన శకటాన్ని నౌకాదళం ప్రదర్శించింది. ఇటీవలే నౌకాదళంలో ప్రవేశపెట్టిన భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక అయిన ఐఎన్​ఎస్ విక్రాంత్​ బోయింగ్ యుద్ధ విమానాలను మోసుకెళ్లగలదు. హిందూ, అరేబియా సముద్రాల్లో భారత్​కు ఐఎన్​ఎస్ విక్రాంత్ అదనపు బలాన్ని చేకూరుస్తోంది. దీన్ని ప్రదర్శింపజేసేలా నౌకా నమూనాపై విమానాలను నిలిపి ఉంచింది. నౌకాదళ శకటం వెనక వారి బ్యాండ్, సైనిక కవాతు బృందాలు అనుసరించాయి.

10:13 January 26

యుద్ధ ట్యాంకుల గౌరవ వందనం

కెప్టెన్ సన్నీ చాహర్ నేతృత్వంలో సైన్యానికి చెందిన టీ-90 భీష్మ , కెప్టెన్ అభినవ్ సాహూ సారధ్యంలో వజ్ర యుద్ధ ట్యాంకులు రాష్టరపతికి గౌరవ వందనం సమర్పించాయి.

10:09 January 26

సైనిక కవాతు షురూ

దిల్లీ రాజ్​పథ్​లో సైనిక కవాతు ప్రారంభమైంది. విశిష్ఠ సేవా మెడల్ పురస్కార గ్రహీత లెఫ్టినెంట్ జనరల్ ఆసిత్ మిస్త్రీ సారధ్యంలో కవాతు ముందుకు సాగుతోంది. అనంతరం అత్యున్నత సైనిక పురస్కారాలైన పరమ వీర చక్ర, అశోక చక్ర పురస్కార గ్రహీతలు గౌరవ వందనం సమర్పిస్తూ ప్రధాన వేదికను దాటి వెళ్లారు.  

10:02 January 26

పతాకావిష్కరణ చేసిన రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ గణతంత్ర వేడుకల ప్రధాన వేదిక రాజ్​పథ్​ వద్ద పతాకావిష్కరణ చేశారు.

09:58 January 26

గణతంత్ర వేదికకు చేరుకున్న రాష్ట్రపతి

ముఖ్య అతిథి జైర్​ బోల్సొనారోతో కలిసి గణతంత్ర వేడుక ప్రధాన వేదిక వద్దకు చేరుకున్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్, త్రిదళాధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులతో కరచాలనం చేశారు. ముఖ్యఅతిథి బోల్సొనారోకు వారిని పరిచయం చేశారు.

09:36 January 26

యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళి

జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులు అర్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. సంప్రదాయంగా ఇండియా గేట్​ వద్ద అమర్​ జవాన్ జ్యోతికి నివాళి అర్పించాల్సి ఉంది. అయితే ఈ సంవత్సరం అందుకు భిన్నంగా యుద్ధ స్మారకం వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

09:21 January 26

జనసంద్రమైన రాజ్​పథ్​

గణతంత్ర వేడుకలకు దేశ రాజధాని దిల్లీ ముస్తాబైంది.  గణతంత్ర వేడుకలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు హాజరయిన కారణంగా రాజ్​పథ్​ జనసంద్రమైంది. మరికాసేపట్లో ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, ముఖ్య అతిథి జైర్ బోల్సొనోరోతో కలసి ప్రధాన వేదిక వద్దకు  చేరుకుంటారు.  

08:54 January 26

'హిమ' వీరుల గణతంత్రం...

లద్దాఖ్​లో ఐటీబీపీ దళాలు గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. -20 డిగ్రీల ఉష్ణోగ్రతలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. సైనికుల 'వందే మాతరం', 'భారత్​ మాతాకీ జై' నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది.

08:37 January 26

తమిళనాడులో అట్టహాసంగా గణతంత్ర వేడుకలు

తమిళనాడులో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెన్నైలోని మెరినా బీచ్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆరాష్ట్ర గవర్నర్ భన్వారి లాల్‌ పురోహిత్  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి పళనీ స్వామీ ఇతర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీసు వందనాన్ని  గవర్నర్  స్వీకరించారు. తమిళ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కామరాజ్‌ నాడార్ రోడ్డులో జరిగిన శకటాల ప్రదర్శన కనువిందు చేసింది.

08:21 January 26

మోదీ శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ట్విట్టర్​ ద్వారా శుభాకంక్షలు తెలిపారు ప్రధాని మోదీ.

08:01 January 26

71వ గణతంత్ర వేడుకలకు యావత్‌ భారతం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో దిల్లీలోని రాజ్‌పథ్‌ వద్ద జరిగే వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ మెస్సియాస్‌ బొల్సొనారో ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

అమరులకు నివాళులు

వేడుకల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ... ఇండియా గేట్‌ వద్ద జాతీయ యుద్ధ స్మారక కేంద్రాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా ప్రధానులు అమర జవాన్‌ జ్యోతి వద్ద నివాళి అర్పిస్తుండగా... ఈ సారి తొలిసారిగా ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారక కేంద్రం వద్ద అంజలి ఘటించనున్నారు.

త్రివిధ దళల కవాతు

దేశ సైనిక సత్తాను, ఆయుధ సంపత్తిని చాటుతూ త్రివిధ దళాలు కవాతు నిర్వహించనున్నాయి. దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ కళాకారులు ప్రదర్శన చేపట్టనున్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వివిధ రాష్ట్రాలు శకటాలను ప్రదర్శించనున్నాయి.

పటిష్ఠ బందోబస్తు

రాజ్‌పథ్‌ వద్ద జరిగే గణతంత్ర వేడుకలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల నిఘాతోపాటు, 10 వేల మంది పోలీసులు, పారా మిలిటరీ సిబ్బందిని దిల్లీలో భద్రత కోసం మోహరించారు.

Last Updated : Feb 18, 2020, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details