ఇరు దేశాల్లోని జాతీయ పండుగలకు భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని సైనికులు స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీ. అయితే దాయాది దేశం ఉగ్రవాదాన్ని పెంచిపోస్తుండటం.. తరుచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో కొన్నేళ్లుగా భారత సైనికులు స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. తాజాగా పూంచ్ జిల్లాలో పాక్ దళాల దాడులను నిరసిస్తూ అదివారం జరిగిన గణతంత్ర వేడుకల్లో సైతం ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమాన్ని విరమించుకున్నట్లు సైనిక అధికారులు వెల్లడించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్‌లోని ఆర్మీ క్యాంపుల వద్ద భద్రతా దళాల ఉన్నతాధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఐజీ ఎన్ఎస్ జమ్వాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం బీఎస్ఎఫ్ అస్పత్రిని సందర్శించి గాయపడిన సైనికులకు పండ్లు, స్వీట్లను పంచారు.