భారతీయ ప్రముఖలపై చైనా నిఘాపెట్టిందంటూ ఓ జాతీయ పత్రిక ప్రచురించిన కథనంపై కాంగ్రెస్ స్పందించింది. చైనా లక్ష్యాలు నెరవేరకుండా సైబర్ భద్రతను పటిష్ఠం చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.
భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, మంత్రులు సహా అనేక మంది రాజకీయ నేతలపై చైనా గూఢచార సంస్థలు నిఘా వేశాయంటూ జాతీయ ఆంగ్ల పత్రిక 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఓ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. చైనా ప్రభుత్వంతో సంబంధం ఉన్న షెన్‌జెన్, ఝెన్హువా అనే ఐటీ సంస్థలు ‘ఓవర్సీస్ కీ ఇన్‌ఫర్మేషన్ డేటాబేస్’ పేరిట ప్రముఖుల సమాచారాన్ని సేకరించడం సహా వారి ఆన్‌లైన్ కార్యకలాపాల్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నట్టు రాసుకొచ్చింది.
ఇదీ చూడండి:-'సరిహద్దు చర్చల వివరాలను ప్రజలతో పంచుకోరా?'
నేతలపై చైనా నిఘా పెట్టడం ఆందోళన కలిగించే విషయమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా పేర్కొన్నారు.
"చైనా చర్యలను మేము ఖండిస్తున్నాం. గత రెండేళ్లలో.. ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపించే విధంగా చైనా ఈ కంపెనీలను ఉపయోగించుకుందా? దీనిపై ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుందా? ఎం జరగలేదని ప్రజలకు హామీ ఇస్తుందా?"
--- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి.
"ఈ నివేదిక నిజమే అయితే... దీని తీవ్రత గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలుసా? లేదా?" అని ప్రశ్నించారు సుర్జేవాలా. దేశ వ్యూహాత్మక నిర్ణయాలను కాపాడుకోవడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందని నిలదీశారు.
ఇలాంటి దుశ్చర్యలకు చైనా మరోమారు పాల్పడకుండా ప్రభుత్వం బుద్ధిచెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. సైబర్ భద్రతను రక్షించేందుకు చేపడుతున్న చర్యలను మరితం బలోపేతం చేయాలని సూచించారు. చైనా లాంటి దేశంతో తలపడుతుంటే.. ఆ పోరు భూమి, ఆకాశం, సముద్రానికే పరిమితమవదని.. సైబర్ స్పేస్‌కు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:-'మోదీజీ.. కరోనా కట్టడి వ్యూహాలు ఏంటి?'