కేంద్రం, రైతుల మధ్య జరిగిన 8వ విడత చర్చలూ అసంపూర్తిగానే ముగిశాయి. ఇరు వర్గాలు తమ తమ వైఖరులను పునరుద్ఘాటించగా.. ఎలాంటి ఫలితం తేలలేదు. జనవరి 15న మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించింది కేంద్రం.
దిల్లీలో రైతుల ఆందోళన, సాగు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై జనవరి 11న సుప్రీం కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే.. చర్చలను 15న ఖరారు చేసినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
ఈ సమావేశం కాస్త వాడీవేడిగా సాగినట్లు చెప్పారు రైతు సంఘాల ప్రతినిధులు. చట్టాల రద్దు కంటే వేరే పరిష్కారం ఏదీ తమకు వద్దని, కోర్టుకూ వెళ్లబోమని స్పష్టం చేశారు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నాన్ మోలా. సాగు చట్టాలను రద్దు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. జనవరి 26న నిర్ణయించిన పరేడ్ యథావిధిగా జరుగుతుందని వెల్లడించారు. జనవరి 11న భవిష్యత్తు కార్యాచరణపై రైతు సంఘాలు చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
హైడ్రామా..
దిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన చర్చల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొత్త సాగు చట్టాలను రద్దు చేసేవరకు ఇళ్లకు తిరిగి వెళ్లేది లేదని రైతులు పేర్కొనగా.. వివాదాస్పద క్లాజులపైనే చర్చలను పరిమితం చేయాలని కేంద్రం సూచించింది. చట్టాల రద్దుకు ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో ఆగ్రహించిన రైతులు సమావేశంలోనే.. 'విజయమో వీర స్వర్గమో' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గెలుపో ఓటమో తేలాలని మౌనంగా కూర్చొని ఉండిపోయారు. ఒక్కసారిగా ఖంగుతిన్న కేంద్రమంత్రులు హడావుడిగా హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అధికారులు, సహచరులతో అంతర్గతంగా కాసేపు చర్చలు జరిపారు.
రైతులు భోజన విరామం కూడా తీసుకోలేదు. కనీసం టీ, అల్పాహారం అయినా తీసుకోవాలని కేంద్ర మంత్రులు కోరగా... "ఇక్కడకు టీ కోసమో, భోజనం కోసమో రాలేదు. ప్రభుత్వం నుంచి తగిన సమాధానం మాత్రమే కావాలి" అని ఘాటుగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో లంగరును విజ్ఞాన్ భవన్ బయటే ఏర్పాటు చేశారు.
'' మేం ఇంటికి తిరిగి వెళ్లేది.. మీరు చట్టాలను రద్దు చేసిన తర్వాతే.''