కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో రెమ్‌డెసివిర్‌ను ఉపయోగించేందుకు అనుమతించిన కొద్ది వారాల్లోనే బ్లాక్ మార్కెట్లో ఈ ఔషధం ధర నింగికెగిసింది. ఈ డిమాండ్‌ను ఉపయోగించుకొని ఔషధం నుంచి డబ్బులు దండుకునేందుకు డ్రగ్ వ్యాపారులు, కెమిస్ట్‌లు అక్రమమార్గం అనుసరిస్తున్నారు. వైరస్‌కు వ్యతిరేకంగా అత్యంత ప్రభావవంతంగా పనిచేసే ఈ ఔషధాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల వీరి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది.
దిల్లీలోని ఓ వ్యాపారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన తోబుట్టువుకు కరోనా సోకడం వల్ల ప్రైవేటు ఆస్పత్రి(కొవిడ్ కేర్ సెంటర్)లో చేర్పించారు.
"రోగికి రెమ్‌డెసివిర్ అవసరం ఉందని ఆస్పత్రిలోని వైద్యుడు నాకు ఫోన్ చేసి చెప్పారు. అయితే రోగి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఔషధాన్ని ముందుగానే ఎక్కించినట్లు తెలిపారు. ఆస్పత్రిలో తగిన నిల్వలు లేవని, కాబట్టి రెండు వయల్స్ తీసుకొచ్చి ఇవ్వాలని నాకు సూచించారు. దిల్లీలోని అధికారిక దుకాణాల్లో దొరకని ఈ రెమ్‌డెసివిర్.. బ్లాక్ మార్కెట్లో దొరికింది."
-రోగి బంధువు, దిల్లీలోని వ్యాపారవేత్త
ఆథరైజ్డ్ డీలర్ల వద్ద రెమ్‌డెసివిర్ కొనుగోలు చేయాలంటే రోగి ఆధార్ నెంబర్, కొవిడ్ పాజిటివ్ రిపోర్టు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. సాధారణంగా దీని ధర రూ. 4,500 ఉంటుంది. చావు బతుకుల సమస్య కావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ల నుంచే ఔషధాన్ని కొనుగోలు చేస్తున్నారు.
అత్యవసర సమయాల్లో డబ్బులు దండుకోవడానికి అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారని ఈటీవీ భారత్‌తో ఆవేదన వ్యక్తం చేశారు రోగి బంధువు.
"మా బంధువు వెంటిలేటర్‌పై ఉన్నాడు. రెండు ప్రదేశాల్లో ఔషధం లభించలేదు. ఇతర మార్గాల గురించి అన్వేషిస్తున్నప్పుడు.. కొందరు మా వద్దకు వచ్చి బ్లాక్మార్కెట్లో దొరుకుతుందని చెప్పారు. ఒక్క వయల్ రూ. 15 వేలని చెప్పారు. తర్వాతి రోజు దాన్ని తీసుకోవడానికి నిర్ణయించుకొని వారిని సంప్రదిస్తే.. తొలుత రూ. 27 వేలు ఆ తర్వాత.. రూ. 35 వేలు డిమాండ్ చేశారు. దీని ధర బంగారంలా పెరిగిపోయింది."