ఉద్ధవ్ ఠాక్రే... ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఇది. బలమైన భాజపాతోనే పోరాడి... మహారాష్ట్ర అధికార పీఠాన్ని దక్కించుకున్న శివసేనాని. తండ్రికిచ్చిన మాట కోసం మిత్రపక్షమైన కమల దళంతో తెగదెంపులు చేసుకుని.. సిద్ధాంతాల పరంగా విభేదాలున్న కాంగ్రెస్-ఎన్సీపీతో కలిశారు ఉద్ధవ్. మహా మలుపులు అనంతరం నేటి సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కానీ ఉద్ధవ్‌కు ముఖ్యమంత్రి పీఠంపై ఆసక్తి ఉందా?
ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడంపై ఉద్ధవ్ మనసులో చివరి నిమిషం వరకు సందిగ్ధం కొనసాగిందని తెలుస్తోంది. చివరకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ 'ఆదేశం' మేరకు ఠాక్రే ఇందుకు ఆంగీకరించారని సమాచారం.
అనుభవజ్ఞుల మధ్య...
కూటమి ఏర్పాటు, ముఖ్యమంత్రి పదవిపై గత శుక్రవారం కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన నేతలు కీలక భేటీ నిర్వహించారు. ఇందులో ఉద్ధవ్‌తో పాటు శరద్ పవర్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో సుస్థిర పాలన ఉండాలంటే కూటమికి ఉద్ధవ్ నేతృత్వం వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి ప్రతినిధులుగా వచ్చిన నేతలు అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఎన్సీపీలో ఇద్దరు మాజీ ఉపముఖ్యమంత్రులు ఉన్నారు. వీరితో పాటు ఎన్నో ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న నేతలు కాంగ్రెస్, ఎన్సీపీ సొంతం. ఈ పార్టీలతో పోల్చితే శివసేన నేతలకున్న రాజకీయ అనుభవం చాలా తక్కువ. అయితే... కాంగ్రెస్, ఎన్సీపీలో ఎవరికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినా... వర్గపోరుతో మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. అందుకే వీరి మధ్య విభేదాలు తలెత్తకుండా.. అందరినీ ఒక్క తాటిపై తీసుకురావాలంటే ఠాక్రేనే ముఖ్యమంత్రి పదవికి సరైన వ్యక్తి అని ఎన్సీపీ కూడా భావించింది.
మహా మలుపుతో...
ముఖ్యమంత్రిగా తన పేరును ప్రతిపాదించినప్పుడు ఠాక్రే మౌనంగానే ఉన్నారు. అయితే ఉద్ధవ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నట్టు సమావేశానంతరం శరద్ పవార్ ప్రకటించేశారు.
ఈ విషయంపై పవార్‌తో ఉద్ధవ్ చర్చించే వారమో... కానీ రాత్రికి రాత్రే అజిత్ పవార్ భాజపాతో చేతులు కలపడం వల్ల రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి.
ఫడణవీస్, అజిత్ పవార్ రాజీనామాలతో 'మహా వికాస్ అఘాడీ' కూటమితో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మూడు పార్టీల నేతలు మరోసారి సమావేశమయ్యారు. సీఎం పదవిపై చర్చ మళ్లీ మొదలైంది. ఎంత మంది చెప్పినా.. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడానికి ఉద్ధవ్ ఎంతో సందేహించారు.
శరద్ మాయాజాలం...
సందిగ్ధంలో ఉన్న ఉద్ధవ్‌తో కొంతసేపు మాట్లాడారు శరద్ పవార్. ఉద్ధవ్ తండ్రి బాలాసాహెబ్ ఠాక్రేతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులమైనప్పటికీ.. బాలాసాహెబ్‌తో స్నేహం మరచిపోలేనని ఉద్ధవ్‌కు తెలిపారు. బాలాసాహెబ్ బతికే ఉంటే.. ఈరోజున ఉద్ధవ్‌ను చూసి ఎంతో సంతోషించేవారన్నారు ఎన్సీపీ అధినేత. ఠాక్రేనే ముఖ్యమంత్రి అవ్వాలని.. ఇది తన 'ఆదేశం' అని తనదైన శైలిలో చెప్పారు పవార్.
సొంత సోదరుడి కుమారుడి నుంచే వెన్నుపోటు ఎదురైనప్పటికీ.. మూడు పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చారు పవార్. అజిత్ నిర్ణయంతో రాష్ట్రంలో దుమారం రేగినప్పటికీ.. ఎన్సీపీ తన వెంటే ఉందని, తాను ఉద్ధవ్ సేనతో ఉన్నానని అందరికీ తెలిసేలా చేశారు.
ఇలా పవార్ రూపంలో లభించిన భరోసాతోనే సీఎం కూర్చీని అధిరోహించాలని ఉద్ధవ్ నిర్ణయించుకున్నారు. అనంతరం ఠాక్రే నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపించనుందని అధికారిక ప్రకటన వెలువడింది.
సందిగ్ధం ఎందుకు?
ఇప్పటి వరకు ఠాక్రే కుటుంబం నుంచి ఎవరూ ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేదు. ఇప్పుడు ఆ అవకాశం ఉద్ధవ్‌కు వచ్చినప్పటికీ... ఎందుకు ఇంతలా ఆలోచించారు? ఇందుకు మూడు-నాలుగు ముఖ్య కారణాలున్నట్టు తెలుస్తోంది.
- అధికారం చేపట్టకుండానే ప్రభుత్వాన్ని తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడం ఠాక్రే కుటుంబానికి ఎంతో ఇష్టం(ఒక రకంగా ఇది బాధ్యతలు లేకుండా అధికారం చెలాయించడం). ఈ విషయాన్ని బాలాసాహెబ్ ఠాక్రే ఎప్పుడూ చెబుతుండేవారు. అందుకే ఆయన జీవితంలో ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తండ్రి వారసత్వ లక్షణాలతో ముందుకు నడవడానికి ఉద్ధవ్ ఇష్టపడతారు. సీఎం బాధ్యతలు చేపట్టడానికి నిర్ణయించుకునే వరకు అదే చేశారు.
- మూడు పార్టీ మధ్య ఎన్నో భేదాలున్నాయి. ముఖ్యంగా సిద్ధాంతాల పరంగా మూడు పార్టీలు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్-శివసేన మధ్య అనేక మార్లు మాటల యుద్ధమూ నడిచింది. ఇప్పుడు వీరు ఒక గూటికి చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే ఎంతో ఆలోచించాల్సిన విషయమే. భాజపాతో పోటీపడి మరీ ఇలాంటి పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. ఈ విషయం ఉద్ధవ్కూ తెలుసు.
- మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ అనిశ్చితే ఉంటుంది. దిల్లీ నుంచి ప్రధాని మోదీ- భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మద్దతున్నప్పటికీ.. తన పదవీ కాలంలో ఫడణవీస్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఉద్ధవ్‌కు పాలనలో ఎలాంటి అనుభవం లేదు.
- ఉద్ధవ్ అనారోగ్య సమస్యలు కూడా ఒక కారణమయ్యే అవకాశముంది. 2016లో ఆయన యాంజియోగ్రఫీ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన కార్యకలాపాలు కొన్ని విషయాలకే పరిమితమయ్యాయి.
మరి ఎందుకు ఒప్పుకున్నారు?
ఉద్ధవ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి 78ఏళ్ల శరద్ పవారే ముఖ్య కారణం. ఒకప్పుడు ఎంతో విభేదించినా.. ప్రస్తుతం శివసేనకు హృదయపూర్వకంగా మద్దతునిస్తున్నారు పవార్. ఎన్సీపీ అధినేత అండతో రాష్ట్రాన్ని పాలించాలని ఉద్ధవ్ ఆలోచించారు.
సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించడానికి సొంత పార్టీలోని నేతల్లో అంత అనుభవం లేదని ఉద్ధవ్‌కు తెలుసు. ఏక్నాథ్ శిండే ఉన్నప్పటికీ... పార్టీపై ఆయన ప్రభావం ఎక్కువ ఉండటం ఠాక్రేకు ఇష్టం లేదని సమాచారం.
51ఏళ్ల క్రితం శివసేనను స్థాపించారు బాలాసాహెబ్ ఠాక్రే. ఎన్నికల రాజకీయాలు చీడపురుగులని... తాను ఎప్పుడూ ఎన్నికల బరిలో దిగనని తేల్చిచెప్పారు. 51ఏళ్ల అనంతరం ఆయన మనుమడు ఆదిత్య ఠాక్రే ఇప్పటికే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఇదీ చూడండి:- మహారాష్ట్రకు 18వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే