భారీ వరదలకు అతలాకుతలమైన బిహార్‌లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. వరద ముంపులో చిక్కుకున్న ఇళ్లలోని బాధితులకు జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాల ఆధ్వర్యంలో ఆహారం, మందులు, మంచి నీళ్లు అందజేస్తున్నారు.
కంకర్‌బాగ్, హనుమాన్ నగర్లో.. ఇళ్ల పైకప్పులపై ఉన్నవారికి భారత వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను జారవిడుస్తోంది. వివిధ స్వచ్ఛంద సంస్థలూ సహాయకచర్యల్లో పాల్గొంటున్నాయి. పట్నా సాహిబ్ గురుద్వారా పలు ప్రాంతాల్లో వంటశాలలను ఏర్పాటు చేసింది.
భారీ వర్షాల దాటికి గంగానది పొంగి బిహార్‌లోని 14 జిల్లాలు వరద ముంపులో చిక్కుకోగా, 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమీక్ష
బిహార్ వరదలపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌గౌబా నేతృత్వంలోని జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమీక్షించింది. సుమారు 900 మందితో కూడిన 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను బిహార్‌కు పంపింది.
విశ్వాసం ఉంది
ఛత్తీస్‌గఢ్ నుంచి కోల్ ఇండియాకు చెందిన భారీ పంపులను తీసుకొచ్చామని, బుధవారానికల్లా వీధుల్లోని వరద నీటిని పూర్తిగా మళ్లిస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.