పనికోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి లాక్డౌన్ సమయంలో చిక్కుకుపోయిన వారు సొంత ఊర్లకు వెళ్లేందుకే మాత్రమే ఆంక్షలు సడలించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. అందరికీ ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.
'ఆంక్షల సడలింపు అందిరికీ కాదు.. వారికి మాత్రమే'
లాక్డౌన్ సమయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లేలా ఆంక్షలు సడలించింది కేవలం వలస కార్మికుల కోసమేనని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇతురులు వెళ్లడానికి అనుమతి లేదని తెలిపింది.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడానికి ముందు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు మాత్రమే ఇప్పుడు సొంత ఊర్లకు వెళ్లేందుకు అనుమతి ఉందని, స్థానికులు, ఇతరులకు కాదని కేంద్రం స్పష్టతనిచ్చింది.
లాక్డౌన్ కారణంగా లక్షలాది మంది వలస కార్మికులు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. తమను సొంత రాష్ట్రాలకు పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ప్రత్యేక రైళ్లు, బస్సులకు అనుమతిచ్చింది కేంద్రం. ప్రయాణికులు తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే పలు రైళ్లు వేలాది మంది కార్మికులను సొంత రాష్ట్రాలకు చేర్చాయి.