పర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్య సంరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు ఓ స్వచ్ఛమైన భూగ్రహాన్ని అందించేందుకు అందరూ సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు.
"ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు.. ఈ భూగ్రహంలోని గొప్ప జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలన్న మన ప్రతిజ్ఞను పునరుద్ఘాటిస్తున్నాం. వృక్ష, జంతు జాలాన్ని వృద్ధి చేయడానికి మనమందరం సాధ్యమైనంత వరకు సమష్టిగా కృషి చేద్దాం."
- ప్రధాని మోదీ ట్వీట్
మనసులో మాట
మోదీ తన తాజా 'మన్‌కీ బాత్' కార్యక్రమంలో... ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గురించి ప్రస్తావించిన ఓ సంక్షిప్త వీడియోను కూడా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
"ఈ సంవత్సరం ఇతివృత్తం జీవవైవిధ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా సందర్భోచితంగా ఉంది. గత కొన్ని వారాలుగా లాక్డౌన్ సమయంలో మన జీవిత వేగం కొంచెం మందగించి ఉండొచ్చు. కానీ ఇది ప్రకృతి గొప్ప తనాన్ని, మన చుట్టూ ఉన్న జీవవైవిధ్యాన్ని గురించి మనం ఆత్మపరిశీలన చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది."
- ప్రధాని మోదీ వీడియో సందేశం
విపరీతంగా పెరిగిపోయిన వాయు, శబ్ధ కాలుష్యాల వల్ల జంతుజాలం చాలా వరకు కనుమరుగైందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ వల్ల కొంత మేర కాలుష్యం తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు చెట్లను నాటి ప్రకృతితో మమేకం కావాలని పిలుపునిచ్చారు.
సరళమైన సంప్రదాయ పద్ధతులు ఉపయోగించి, వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవచ్చని మోదీ అన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నందున పక్షులకు ఎలాంటి నీటి కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:భూమాతకు పచ్చలహారం! నేడు ప్రపంచ పర్యావరణ దినం