కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన భేటీలో జీఎస్టీ పరిహారంపై మోదీ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు సోనియా. దృశ్యమాధ్యమ వేదికగా జరిగిన ఈ సమావేశంలో బంగాల్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.
జీఎస్టీ చెల్లింపులపై..
ఈ భేటీలో రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు, జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణపై చర్చించారు సోనియా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అందరమూ సమన్వయంతో ముందుకుపోవాలన్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని సకాలంలో చెల్లించటం తప్పనిసరి అని, అయితే అది జరగటం లేదని ఆక్షేపించారు. దీనివల్ల రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
"2020 ఆగస్టు 11న ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్రాలకు పరిహారం చెల్లించే పరిస్థితిలో కేంద్రం లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. సహకార సమాఖ్య విధానానికి జీఎస్టీ ఒక ఉదాహరణ. ఐదేళ్లపాటు పరిహారం చెల్లిస్తామని హామీ ఇస్తేనే రాష్ట్రాలు తమ రాజ్యాంగ అధికారాలను వదులుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశ ప్రజలను కూడా మోదీ సర్కారు మోసం చేస్తుంది."